వెలుగు స్పెషల్: మేమింతే.. మేం మారం! ప్లీజ్.. రాహుల్, ప్రియాంక ఫారెన్ పారిపోండి

వెలుగు స్పెషల్: మేమింతే.. మేం మారం! ప్లీజ్.. రాహుల్, ప్రియాంక ఫారెన్ పారిపోండి

అయ్యా  రాహుల్ గాంధీ,  ప్రియాంక గాంధీ.. మీకు చేతులెత్తి మొక్కుతున్నం.  దయచేసి ఇండియాలో ఇబ్బంది పడకండి.  మా కోసం  కొట్లాడకండి.  ఏసీలో ఉండక ఎండలో జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌లో ధర్నాలు చేసి లోటాలకొద్దీ చెమటలు కక్కుడేంది?  లగ్జరీ ఫ్లాట్‌‌‌‌లలో ఆర్డర్ పెట్టి నచ్చింది  తినకుండా చెట్లకింద కూకొని రొట్టె ముక్కలు తిని,  20 రూపాయిల కూల్ డ్రింక్ తాగి ఉండుడేంది సారూ. పోలీసులు గొర్ర గొర్ర గుంజ్కపోయి, ప్రియాంకను ఈడ్చకపోయి పోలీస్ వ్యానుల ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్‌‌‌‌కు  తీస్కపోవుడేంది. గిదంత మీకు అవసరమా?  మీకేం తక్వ.  శిన్నప్పుడు  మీ ముత్తాత తండ్రి  మోతీలాల్ నెహ్రూ పాఠం సద్వుకున్నం.  మీ ముత్తాత  నెహ్రూకి కారు లేటయి బడికి ఆలస్యమయిందట. తెల్లారే..  మోతీలాల్ నెహ్రు ఉండే ఇల్లు ఆనంద్ భవన్ 12 గేట్ల దగ్గర  లగ్జరీ కార్లు పెట్టించి నీకు నచ్చిన కారులో  రోజూ  స్కూలుకు వెళ్లమని  మోతీలాల్  నెహ్రూ చెప్పిండంట. 

 మీ ముత్తాత తండ్రి రేంజే అది.  మీరు ఇంకెట్ల ఉండాలే. రోజుకో  రోల్స్‌‌‌‌రాయ్  కారులో  తిర్గాలే,  సొంత విమానం కొన్కొని  విదేశీ యాత్రలు జెయ్యలే,  పబ్,  క్లబ్బులని తిర్గాలే.  పెద్దపెద్ద  బిసినెస్‌‌‌‌లు పెట్టుకుని  కమాయించుకోవాలే.  కానీ గిదేంది సారూ.  మా కోసం మీరు రోడ్లమీద కొట్లాడుడేంది.  మీ చెల్లె కూడా రోడ్డుమీద పడుకుంటే మీకు న్యాయంగా ఉందా సారు.ఉత్త చాయ్,  పకోడీలు అమ్ముకొని  బత్కేటోళ్లే  ఇయ్యాల మంచిగ బత్కుతున్నరు సారు. మీరు కోటీశ్వరులు. కో అంటే  కొండమీద  కోతిని గిట్ల తెచ్చే సత్తా ఉన్నోళ్లు.  మా బత్కులు మార్చాలని మీరు కొట్లాడితే మారవు సారు.  మాకు గుండెల నిండా  దేశభక్తి ఉంది.  మాకు మునుపు దేవుడు అంటేనే తెల్వది.  ఈ పదేండ్లల్లనే  దేవుడు అంటే ఎర్కైంది.  ఇప్పుడిప్పుడే  కొబ్బరికాయ ఎట్ల కొట్టాల్నో నేర్చుకుంటున్నం. మీరు వచ్చి శెడగొట్టకండి  ప్లీజ్.  మీకు ఇంకో ముచ్చట తెల్వది.  ఇయ్యల్రేపు  దేవుళ్లను పక్కన పెట్టి  లీడర్లనే  మొక్కుతున్నం.  దేవుళ్ల  ఫొటోలు పెట్టట్లేదు.  లీడర్ల  ఫొట్వలునే పెడ్తున్నం.  మీకు శాతనైతే  చైనావాళ్లకు  
చేతులు లేకుంట చేస్తం.  ఉత్త గోధుమ పిండికి  కొట్లాడుకునే పాకిస్తాన్ వాళ్లతో యుద్ధం చేస్తం అనాలే.  అవసరమైతే  నాల్గైదు బాంబులు ఎయాలే.  నువ్వు కనీసం  లచ్చింబాంబు గిట్ల పేల్చవు నువ్వేం లీడరువు  రాహుల్ సాబ్. 

మీరెట్ల లీడర్ ఐతరు సారు

 నిన్ను పొద్దు మాపు టీవీల, పేపర్‌‌‌‌‌‌‌‌ల  పప్పు పప్పు  అని తిడ్తున్నరు మీకు గింతకూడ రోషం లేకపాయే.  నిన్నుగాక మీ అమ్మను ఈ దేశం కాదని మీ పుట్టుక మీద కూడ  పార్లమెంట్ల తిడ్తుంటే  నవ్వుకుంట ఉంటరు కానీ కోపం రాకపాయే.  మీరేట్ల  లీడర్  ఐతరు సారు.  ఆరు బూతులు..మూడు పంచాదులు జెయ్యాలే.  మీ నోటి నుంచి ఒక్క బూతు మాటైన రాదాయే.  నువ్వేవో  బయటిదేశాలల్ల బగ్గ సద్వినవ్.  మాకు  సద్వినోళ్లు లీడర్ వద్దు, సద్వురాని లీడరే పాలించాలే.  ఎందుకంటే  మేం గిట్ల సద్వుకోలే.  పబ్లిక్కు  సద్వుకున్న లీడర్ వద్దు సారు.  మీరు  మంచి  దవాఖానలు పెడ్తే  కుద్రది.  దవాఖానలో  డాక్టర్ ఉంటే  రోగాలు తగ్గుతయి.  రోగాలు  తగ్గితే  మా పూజలు,  బాబాల దగ్గరికి ఎవరు పోవాలే?  ఇదంత ఏం జేద్దామని  అన్కుంటున్నవ్.  మార్చేద్దామనే  అబ్బా.. ఆహా.  మాకు విష్ణు అవుతార  పురుషుడమ్మా.  

నీకు రాజకీయం తెల్వది రాహుల్.. జిత్తులమారి నక్కలెక్క ఆలోచించాలే

మాకు నోట్లే నాల్కెలు ఉండొద్దు,  ప్రశ్నించే దిమాక్ ఉండొద్దు.  భక్తి ఉంటే సాలు. అంతా ఆ పైవాడి దయ అని బత్కేస్తం. ఇంతకన్నా మాకేం కావాలే.  నువ్వొచ్చి నేను మంచిగ పాలిస్త,  పబ్లిక్ బత్కులు మారుస్తంటే మేం పిచ్చోళ్లమా?  ప్రధానమంత్రి  గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద సుమారుగా 81 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తుంది కేంద్ర సర్కారు. 

140 కోట్ల మంది భారతీయుల్లో  సగానికి పైగా ఫ్రీ రేషన్.  అంటే  ఇంతకన్నా  గొప్పవాళ్లను నువ్వు జెయ్యలేవ్,  నీతోని కాదుపో.  నేను బాస్మతి బియ్యంతో బిర్యాని పెడతానని వస్తే మేం రానివ్వం.  మేం బానిసలం బానిసలుగానే బత్కుతం.   నీకు రాజకీయం తెల్వది  రాహుల్,  జిత్తులమారి నక్కలెక్క ఆలోచించాలే. ఎండల రోడ్డు మీద పడుకుంటే  ఏం వస్తది?  ఏసీ గదిలో  కూర్చొని స్కెచ్ వేస్తే  సీటు వస్తది.  ఊసరవెల్లిల ఓట్లకు ముందు ఓ రంగు,  గెలిచినంక ఓ రంగు, ఓడినంక ఇంకో రంగు.  రంగు మార్చలేనోడు రాజకీయాలకే  పనికిరాడు. ఇచ్చిన హామీలు తాబేలు  నడకల  ఐదేళ్లకు  ఓ అడుగు ముందుకు పడితే అదే అభివృద్ధి.  గీ శిన్న లాజిక్  తెల్వకుండ రాజకీయంలకు  వచ్చినవ్.. ఆగమైపోతున్నవ్.  మాకు మీలాంటివాళ్లు అవసరం లేదు.

పండపెట్టి తొక్కి మా కసరు తీసేవాళ్లే కావాలె

మమ్మల్ని  పండపెట్టి తొక్కి మా కసరు తీసేవాళ్లే మాకు కావాలె.  కోడికి ఈకలు పీకేసి అయ్యో పాపం చలికి వణుకుతుందే అని ఇన్ని నూకలు ఏస్తే బుక్కకుంట ఉంటది. మాది అదే బతుకు. మేం కష్టపడి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే అండ్ల చికెన్ ముక్క గుంజుకుంటే  అన్నంల పప్పు ఏస్కొని తింటం.  పప్పు కూడా గుంజుకుంటే  శింతపులుసు పోస్కొని తింటం.  లీడర్  బువ్వే గుంజుకొని  ఫ్రీ రైస్ ఇస్తే ఎగ్రి  గంతేసి  ఫ్రీబియ్యం  తెచ్చుకుంటం. ఇది మా జిందగీ. అంతేకానీ  ఇదేందని  ప్రశ్నించి సమాధానాలు అడిగి  తెల్సుకొని తీరిక మాకు లేదు.  పోండి సర్.. మా సావు మేం సత్తం. అంతేగానీ ఇంటర్నేషనల్ స్కూళ్లు పెడత,  మీ బతుకులు  మారుస్తంటే ఊకోం.  రాహుల్ మాకు వాట్సాప్ యూనివర్సిటీ చాలు. అక్కడ ఫీజు లేదు,  పరీక్ష లేదు,  తప్పులు కూడా ఎవరూ దిద్దరు.  మీకు కోట్ల ఆస్తి, పేరు, హోదా ఉంది.  ఫారెన్‌‌‌‌లో  ఏ సముద్రం ఒడ్డునో కూర్చొని కప్పు కాఫీ తాగుతూ హాయిగా బతకండి బ్రో. 

మీ ముత్తాత నెహ్రూ ఎవుసం, పరిశ్రమలు అభివృద్ది చేసిండు

 మీ ముత్తాత  నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఎవుసం, పరిశ్రమలు అభివృద్ది చేసిండు. విద్య, సైన్స్ సంస్థలు, ఐఐటీలు,  ఎయిమ్స్‌‌‌‌, ఐఐఎంలు, యూజీసీ, అణుశక్తి కమిషన్, అంతరిక్ష పరిశోధనలకు బునాది ఏసిండు. మీ నాయ్నమ్మ  ఇందిరా గాంధీ  గరీబీ  హటావో,  బ్యాంకులు జాతీయకరణ,  రాజభరణాల రద్దు. అందరికి బువ్వ కోసం హరిత విప్లవాన్ని ముందుకు తీస్కపోయింది.  ఇగ మీ నాయ్న రాజీవ్ గాంధీ కంప్యూటర్,  టెలికాం విప్లవం తెచ్చిండు.  జవహర్ నవోదయ విద్యాలయాలు,  పంచాయతీరాజ్‌‌‌‌కు బలం ఇవ్వాలని బిల్లు తెచ్చిండు.  మీ మూడు తరాలు పబ్లిక్కు కోసం పని చేసిన్రు.  నువ్వు వాళ్లకన్న మంచిగ జేసి మా బత్కులు మారుద్దమని వస్తున్రు. హామ్మా.. మేం తెల్వి తక్వోళ్లం కాదు రాహుల్ సర్  మాకు గివ్వన్ని వద్దు  పుసుకున్న మా బత్కులు సక్కంగ ఐతే ఎట్లా.  మాకు మీ నాయ్నమ్మ లెక్క గుడ్సెలు ఉండేటోళ్లకు పెంకుటిండ్లు కట్టిస్తరనే భయం. మాకు ముర్కి కాల్వల పొంటి బత్కుడే బగ్గ ఇష్టం. 

 

అశోక్‌‌‌‌ కొండ్రు,సీనియర్‌‌‌‌‌‌‌‌ జర్నలిస్ట్‌‌‌‌

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.