
ఫెడరల్ యాంటీ మనీలాండరింగ్ ఏజెన్సీ 'ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్' కొత్త డైరెక్టర్‌గా తాత్కాలిక ఈడీ చీఫ్ రాహుల్ నవీన్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ బుధవారం(ఆగస్టు 14) ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన నియామకం కొనసాగుతుందని అపాయింట్మెంట్స్ కమిటీ తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
57 ఏళ్ల రాహుల్ నవీన్ 2019 నవంబర్‌లో EDలో స్పెషల్ డైరెక్టర్‌గా చేరారు. గతేడాది సెప్టెంబర్ 15తో సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం ముగియడంతో ఈయన ఈడీ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ పదకొండు నెలల కాలంలోనే ఈయన బాగా ప్రాచుర్యం పొందారు. ఈ కాలంలోనే ఈడీ.. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌లను వేర్వేరు మనీలాండరింగ్ కేసులలో అరెస్టులు చేసింది. మనీలాండరింగ్ కేసులో ఒక రాజకీయ పార్టీని నిందితుడిగా పేర్కొంది.
IRS అధికారి
రాహుల్ నవీన్ 1993 బ్యాచ్‌కు చెందిన IRS అధికారి. ఈడీలో చేరడానికి ముందు ఆదాయపు పన్ను కమిషనర్ (బదిలీ ప్రైసింగ్ -I) పన్ను విధానం, చట్టాల విభాగంలో అండర్ సెక్రటరీగా, నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో అదనపు డైరెక్టర్‌గా సుదీర్ఘ కాలం కొనసాగారు. 2011 నుండి 2015 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) యొక్క FT&TR (విదేశీ పన్ను మరియు పన్ను పరిశోధన) విభాగానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.