
హైదరాబాద్, వెలుగు: లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రజా గొంతుకై మాట్లాడారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని దశాబ్దాల తర్వాత దేశంలో ప్రతిపక్షం ఉందనే విషయం రాహుల్ ప్రసంగంతో తెలిసిందన్నారు. ఆయన లోక్ సభలో మాట్లాడిన మాటలను యావత్తు దేశం హర్షిస్తుందని చెప్పారు.
రాహుల్ వాస్తవాలు మాట్లాడితే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఎదురు దాడికి దిగారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ కంకణబద్ధుడై ఉన్నారనేది ఆయన మాటలతో అర్థమవుతోందన్నారు. పీసీసీ తరపున రాహుల్కు నిరంజన్ కృతజ్ఞతలు చెప్పారు. రాహుల్ నాయకత్వంలో కచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.