
న్యూఢిల్లీ, మోరెనా(మధ్యప్రదేశ్): ‘మోడీజీ! మీ టైమైయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సమయమొచ్చింది’ అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరో రెండు దశల లోక్‌సభ ఎన్నికలు మిగిలి ఉండగానే ఈ సంగతి తేలిపోయిందని చెప్పారు. యువత, వృద్ధులు అంతా కాంగ్రెస్ ప్రకటించిన న్యాయ్ పథకానికే ఓటేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం చెప్పేదిదేనని అన్నారు. కేంద్రంలో మార్పునకు టైం వచ్చిందన్నారు. ప్రధాని మోడీపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఆయన మరోసారి ప్రధాని అవడం కల్ల అని రాహుల్ జోస్యంచెప్పారు. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో పార్టీ ప్రచార సభలో ఆయనీ కామెంట్స్చేశారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోడీ ఇప్పుడేం చెప్పినా నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజాలను ఫేస్చేసే శక్తి ఆయనకు లేదన్నారు. 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టారని రాహుల్మండిపడ్డారు. మోడీ నిర్ణయంతో దేశంలోని దొంగలందరూ తమ బ్లాక్‌మనీని వైట్‌గా మార్చేసుకున్నారని ఆరోపించారు. 15 మంది బడాబాబుల అప్పులను మాఫీ చేసిన మోడీ సర్కారుకు రైతులు, యువతపైన మాత్రం కనీస సానుభూతి లేదని విమర్శించారు. పంటల్లేక అప్పు చెల్లించలేని రైతులను జైళ్లకు పంపారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి ఉండదని రాహుల్హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లడం, బడా పారిశ్రామికవేత్తలతో కలిసి తిరగడం మోడీ అలవాటని చెబుతూ.. పేదలు, సామాన్యులతో కలిసి ఉండడమే తనకిష్టమని రాహుల్చెప్పారు.
సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణ
రాఫెల్ డీల్ విషయంలో ‘చౌకీదార్ చోర్‌హై’ అన్న కామెంట్‌ను కోర్టు తీర్పునకు ఆపాదించడంపై రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పారు. అత్యున్నత న్యాయస్థానంపై తనకు గౌరవముందని అన్నారు. ఈమేరకు బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యలు చేయలేదని చెబుతూ కోర్టు ధిక్కార కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా రాహుల్ మూడు పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు అందజేశారు.