సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్రకు జనం నీరాజనం

సంగారెడ్డి జిల్లాలో రాహుల్ పాదయాత్రకు జనం నీరాజనం

సంగారెడ్డి/పుల్కల్/ జోగిపేట, వెలుగు : కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీ సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన భారత్​ జోడో యాత్ర శనివారం మూడోరోజు జనసంద్రంగా మారింది. 161వ నేషనల్​ హైవే జేఎన్టీయూ వద్ద ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యాత్ర హైవే మీదుగా చౌటకూర్ అందోల్, జోగిపేట మీదుగా అన్నాసాగర్, దానంపల్లి వరకు కొనసాగింది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమైన యాత్ర కిచ్చనపల్లి, రాంసాన్ పల్లి, కన్ సన్ పల్లి చౌరస్తాల మీదుగా గడిపెద్దాపూర్ చేరుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడి నేరుగా మెదక్ జిల్లా అల్లాదుర్గం వెళ్లిపోయారు. రాహుల్ కు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఘనస్వాగతం పలుకగా, అడుగడుగునా పార్టీ కార్యకర్తలు నీరాజనం పలికారు. యాత్రలో రాహూల్​ వెంట టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ  సీనియర్​ నాయకులు కుసుమ​కుమార్, గాలి అనిల్​కుమార్​   తదితరులు ఉన్నారు. 

రోడ్డుపై ఫుట్ బాల్ ఆడి..

పాదయాత్ర చేస్తూనే రాహుల్ గాంధీ రోడ్డుపై కాంగ్రెస్ నాయకులతో ఫుట్ బాల్ ఆడి ఉత్సాహపరిచారు. రేవంత్ రెడ్డి, మదన్ మోహన్, దామోదర రాజనర్సింహతో కలిసి ఆయన ఫుట్ బాల్ ఆడుతుండగా కార్యకర్తల్లో జోష్ పెరిగి ‘జై రాహుల్.. జై జై కాంగ్రెస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో శనివారంతో ముగిసింది. జిల్లాలో నాలుగు రోజులపాటు పాదయాత్ర షెడ్యూల్ ఉన్నప్పటికీ శుక్రవారం సెలవు ప్రకటించి సుల్తాన్ పూర్ జేఎన్టీయూ వద్ద రాహుల్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 3న బీహెచ్ఈఎల్ దగ్గర జిల్లాలోకి ఎంటర్ అయిన యాత్ర పటాన్ చెరు,  సంగారెడ్డి అందోల్ నియోజకవర్గాల పరిధిలో మూడు రోజులు కొనసాగింది. శనివారం రాత్రికి మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బస చేసి ఆదివారం పెద్దశంకరంపేట మీదుగా మెదక్ జిల్లాలో ఒక రోజు పాదయాత్ర కొనసాగనుంది. అక్కడ రాహుల్ కు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.కులవృత్తిదారులను కలుస్తూ.. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా నడిచారు. కులవృత్తులు ఇతర కార్మిక వర్గాలను కలుస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందోల్ లో గౌడ కులస్తుల మోకు ధరించి కల్లుకుండను చేత పట్టుకుని కొంతసేపు పాదయాత్ర చేశారు. జోగిపేటలో కుమ్మరులు చేస్తున్న మట్టికుండల తయారీలో పాల్గొని వారి కులవృత్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్​కు వెళ్లిన రాహుల్ పాదయాత్రకు కొంతసేపు బ్రేక్ ఇచ్చి పార్టీ ముఖ్య నాయకులతో చాయ్ తాగి ముచ్చటించారు.అనంతరం పాదయాత్రలో మహిళలు, పిల్లలను కలస్తూ ఉత్సాహంగా ముందుకు నడిచారు.