‘ఓట్చోరీ’పై బిహార్నుంచి రాహుల్ ప్రజాపోరు.. యువతకు కీలక పిలుపు

‘ఓట్చోరీ’పై బిహార్నుంచి రాహుల్ ప్రజాపోరు.. యువతకు కీలక పిలుపు

న్యూఢిల్లీ: ‘ఓట్​ చోరీ’పై ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్​అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ సిద్ధమయ్యారు. బిహార్​నుంచి ఈ పోరాటాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఇండియా కూటమి నేతలతో కలిసి దీన్ని చేపట్టనున్నారు.  ‘‘ఓట్​ చోరీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేయాలని నిర్ణయించాం. బిహార్​ నుంచి దీన్ని చేపడ్తాం. దేశమంతా క్లీన్​ఓటర్​ లిస్టు కోసమే మా ఉద్యమం. వన్​మ్యాన్​.. వన్​ఓట్​మా నినాదం” అని గురువారం ఎక్స్​లో రాహుల్​గాంధీ ట్వీట్ చేశారు. ఓట్​ చోరీపై ఉద్యమం ఎన్నికల ఇష్యూ మాత్రమే కాదని, ప్రజాస్వామ్య రక్షణ కోసమని తెలిపారు.

 ఈ నెల 17 నుంచి బిహార్​లో ‘‘ఓటర్​ అధికార్​ యాత్ర’’తో ప్రజా ఉద్యమం ప్రారంభిస్తామని, సెప్టెంబర్​ 1 వరకు ఇది కొనసాగుతుందని వెల్లడించారు. ‘‘బిహార్​ యువతకు ఇదే నా విన్నపం. ఓట్ల దొంగల పనిపడ్దాం.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఈ ప్రజాపోరులోకి మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. యువత, కార్మికులు, రైతులు, ప్రతి ఒక్క పౌరుడు కలిసి  వస్తారని ఆశిస్తున్నా” అని ట్వీట్​లో ఆయన పేర్కొన్నారు. గతంలో భారత్​ జోడో యాత్ర సందర్భంగా తాను బిహార్​లో పర్యటించినప్పటి జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్​చేశారు. 
 
సాసారాం నుంచి యాత్ర మొదలు

బిహార్​లో రాహుల్​గాంధీ చేపట్టబోయే ‘‘ఓటర్​ అధికార్​ యాత్ర’’ షెడ్యూల్​ను కాంగ్రెస్​ జనరల్​ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్​ ఎక్స్​ వేదికగా వెల్లడించారు. యాత్రలో రాహుల్​గాంధీతోపాటు బిహార్​లోని మహాఘట్​ బంధన్​ పార్టీలు కూడా కలిసి వస్తాయని తెలిపారు. ఆర్జేడీ లీడర్​ తేజస్వీ యాదవ్​ వంటి వారు యాత్రలో పాల్గొంటారని ఆయన  పేర్కొన్నారు. ఈ నెల 17న సాసారాంలో యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 

గయా, ముంగేర్​, భగల్​పూర్​, కతిహార్​, పూర్ణియా, మధుబనీ, దర్భంగా, పశ్చిమ చంపారన్​, ఆరా ప్రాంతాల్లో యాత్ర కొనసాగుతుందని కేసీ వేణుగోపాల్​ వివరించారు. సెప్టెంబర్​ 1న పాట్నాలోని గాంధీ మైదాన్​లో  భారీ బహిరంగ సభతో యాత్ర ముగుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఓట్​ చోరీపై దేశవ్యాప్తంగా నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ‘ఓట్​ చోర్​.. గద్దీ ఛోడ్’ పేరిట అక్టోబర్​ 15 వరకు వివిధ రూపాల్లో నిరసనలకు షెడ్యూల్​ ప్రకటించింది. అందులో భాగంగా గురువారం రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ నేతలు క్యాండిల్​ ర్యాలీలు చేపట్టారు.