రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లోని భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి జాతర మహోత్సవాలు జరగనన్నాయి. నేటి నుంచి ఈ నెల 11 వరకు జరగనున్న ఉత్సవాలకు ఆలయాన్ని సిద్ధం చేశారు. ఈ జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు కులకర్ణి, ఈవో శివ రుద్రప్ప భక్తులకు పిలుపునిచ్చారు. జాతర తొలి రోజు ఉదయం ధ్వజారోహణంతో వేడుకలు ప్రారంభమవుతాయి. శిఖర పూజ, వీరభద్రేశ్వర-బసవేశ్వరుల అభిషేకాలు, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తారు.
అనంతరం శివాచార్య గంగాధర స్వామి పాదపూజ, తీర్థప్రసాదాల పంపిణీ ఉంటుంది. రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 7న మహా రుద్రాభిషేకం, పల్లకి సేవ, అగ్నిగుండం, స్వామివారి కల్యాణం, రథోత్సవం, 8న సహస్ర బిల్వార్చన, వీరాంజనేయస్వామికి పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, 9న శతనామవళితో బిల్వార్చన, భద్రకాళి అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. 10న అభిషేకాలు, 11న అభిషేకాల అనంతరం రథోత్సవం బసవేశ్వర మందిరం నుంచి తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.
