
రెస్టారెంట్లు..వాటి పేర్లు..సాధారణంగా ఉంటే కస్టమర్లకు అంతగా నచ్చడం లేదు. అందుకే నిర్వాహకులు కొత్త కొత్త పేర్లు..వింత వింత మోడల్స్ లో రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని భుసావల్ డివిజన్‌లోని నాసిక్ రైల్వే స్టేషన్‌లో "ఆఫ్‌ట్రాక్ కోచ్ రెస్టారెంట్" ను ప్రారంభించారు. రైలు పట్టాలపై స్లీపర్ కోచ్ ను పూర్తి ఏసి సదుపాయంతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్..కస్టమర్లకు వినూత్న అనుభవాన్ని అందిస్తోంది.
పాతతరం సేవలందించని కోచ్‌ను రెస్టారెంట్ కోసం తీర్చిదిద్దారు. కోచ్ లోపలి భాగాన్ని రెస్టారెంట్ తరహాలో మార్చారు. బయట కూడా కుర్చీలను ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో కోచ్ లో ఇంటీరియర్ లను ఏర్పాటు చేశారు. రైలు ప్రయాణీకులకు ప్రీమియం అనుభవాన్ని అందించడానికి రైల్వే అధికారులు ఈ వినూత్న ఆలోచనను రూపొందించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైసెన్స్ మంజూరు చేయడం ద్వారా కోచ్ రెస్టారెంట్ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.
రైలు ప్రయాణికులు, సాధారణ ప్రజానీకానికి ఈ రెస్టారెంట్ లో ఒక ప్రత్యేకమైన, ఆహ్లాదకరమైన భోజన అనుభవం ఉంటుంది. రైలు ప్రయాణికులు, స్థానికులు ఎవరైనా ఈ రెస్టారెంట్‌లో రుచుల్ని ఆస్వాదించవచ్చు. పరిశుభ్రత, నాణ్యమైన ఆహారంతో ప్రీమియం భోజన అనుభవాన్ని పొందొచ్చు. ఈ రైలు ప్రయాణీకులకు 24 X 7 పరిశుభ్రమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే కాకుండా రైల్వేలకు ఆదాయాన్ని కూడా అందిస్తుందని భావిస్తున్నారు. విభిన్న వంటకాలతో కూడిన ఈ కోచ్ రెస్టారెంట్.. రైలు వినియోగదారులకు స్థానిక ధరలకే నాణ్యమై ఆహారాన్ని అందిస్తుంది.