పద్మారావునగర్, వెలుగు: ఇండియన్ రైల్వేలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్(ఎన్ఎఫ్ఐఆర్), దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ చిలకలగూడలోని ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాల సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం ప్రక్రియను స్పీడప్ చేయాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.55 వేలుగా నిర్ణయించి, అదే నిష్పత్తిలో అన్ని కేడర్లకు వర్తింపజేయాలని, 50 శాతం దాటిన కరువు భత్యాన్ని మూల వేతనంలో కలపాలని, నిలిపివేసిన 18 నెలల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైల్వేలను ప్రైవేటుపరం చేయవద్దని, అలా చేస్తే మరో ఇండిగో తరహా పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయిస్ సంఘ్ అధ్యక్షుడు ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ భరణీ భానుప్రసాద్, మీడియా ఇన్చార్జి షేక్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.
