పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏపీకి వైజాగ్ రైల్వే జోన్

పునర్వ్యవస్థీకరణ చట్టం కింద తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఏపీకి వైజాగ్ రైల్వే జోన్

సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయి దాదాపు దశాబ్ధకాలం దాటేసింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు ఏం దక్కింది అనే ప్రశ్నకు రైల్వేల నుంచి వివరణ వచ్చింది. 

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులో భాగంగా.. రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తోందని వెల్లడించింది. ఇదే క్రమంలో తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కేచ్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు బదులిచ్చింది. దీనికి తోడు ఏపీ రాజధాని అమరావతిని ఇతర ప్రాంతాలతో కలిపేందుకు రైల్వే స్టేషన్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు స్టార్ట్ అయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 

రైల్వే బోర్డు జాయింట్ డైరెక్టర్ సునీల్ ప్రభాత్ వివరాలను అందిస్తూ.. చట్టంలోని మౌలిక సదుపాయాలకు సంబంధించిన షెడ్యూల్ 13లోని 8, 10 , 11 అంశాలు మంత్రిత్వ శాఖకు సంబంధించినవని.. ఈ ప్రాజెక్టుల అమలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉందని స్పష్టం చేశారు.   

* షెడ్యూల్ లోని 8వ అంశం కింద కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు ప్రధాని మోదీ జనవరి 8న శంకుస్థాపన చేశారు. భవనాల నిర్మాణానికి టెండర్లు కూడా పిలవబడ్డాయి. 

* షెడ్యూల్ లోని 10వ అంశం కింద వివిధ రకాల ఆధునిక రైల్వే స్టాక్‌లను తయారు చేసి నిర్వహించగల సామర్థ్యం గల రైలు తయారీ యూనిట్‌ను తెలంగాణలోని కాజీపేటలో అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అనుమతి మంజూరై రైల్ వికాస్ నిగమన్ లిమిటెడ్ కి అప్పగించబడింది. 

* ఇక షెడ్యూల్ లోని 11వ అంశం కింద ఏపీ కొత్త రాజధాని అమరావతికి ప్రత్యక్ష రైలు కనెక్టివిటీని అందించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఎర్రుపాలెం-నంబూరు వయా అమరావతి అనే 56.53 కిలోమీటర్ల కొత్త లైన్ మంజూరు చేయబడింది.