రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కారు నిధులిస్తలె

రైల్వే ప్రాజెక్టులకు  రాష్ట్ర సర్కారు నిధులిస్తలె
  • మేమే సొంతంగా కొన్ని ప్రాజెక్టులు చేపట్టినం: దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌‌ మాల్యా
  • ఉందానగర్ నుంచి ఎయిర్ పోర్ట్‌‌ దాకా ఎంఎంటీఎస్ రైళ్లపై చర్చిస్తున్నం
  • ప్రిలిమినరీ స్టడీ పూర్తి చేసినం.. జీఎంఆర్, రైల్వే సహకారంతో ప్రాజెక్టు
  • తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలతో జీఎం మీటింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌‌ మేనేజర్‌‌ గజానన్‌‌ మాల్యా చెప్పారు. తామే సొంతంగా పూర్తి నిధులతో కొన్ని ప్రాజెక్టులు కడుతున్నామని తెలిపారు. ‘‘ఉందానగర్ నుంచి ఆర్జీఐ ఎయిర్ పోర్ట్‌‌కు ఎంఎంటీఎస్ రైళ్ల ప్రాజెక్టుపై చర్చలు నడుస్తున్నాయి. ప్రిలిమినరీ స్టడీ పూర్తి చేశాం. జీఎంఆర్, రైల్వే సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నాం” అని పేర్కొన్నారు. అహ్మదాబాద్– ముంబై బుల్లెట్ ట్రైన్ సక్సెస్‌‌ను బట్టి హైదరాబాద్‌‌ ప్రాజెక్ట్‌‌పై స్టడీ చేస్తామని వెల్లడించారు. మంగళవారం రైల్ నిలయంలో తెలంగాణ, కర్నాటక ఎంపీలతో జీఎం మాల్యా సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, ఆన్‌‌గోయింగ్ ప్రాజెక్టులపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ అవసరం లేదని రైల్వే శాఖ భావిస్తోందన్నారు. కాజీపేట–బల్లార్షా మూడో లైను ప్రాజెక్టు, కాజీపేట–విజయవాడ రైల్వే లైను, మనోహరాబాద్‌‌–గజ్వేల్‌‌ – కొత్తపల్లి కొత్త రైల్వే లైను, అక్కన్నపేట–మెదక్‌‌ కొత్త రైల్వే లైను, ఫలక్‌‌నుమా–డోన్‌‌ డబ్లింగ్‌‌ ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. ఉందానగర్‌‌ – షాద్‌‌నగర్‌‌–గొల్లపల్లి మధ్య డబ్లింగ్‌‌, ఎలక్ట్రిఫికేషన్ పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. 85 శాతం మెయిల్‌‌ లేదా ఎక్స్‌‌ప్రెస్‌‌ రైళ్లను, 55 ఎంఎంటీఎస్‌‌ రైళ్లను, 85 ప్యాసింజర్‌‌ రైళ్లను మళ్లీ ప్రారంభించినట్లు చెప్పారు.

మన ఎంపీలు ఏమన్నారంటే..?
పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తోందని టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్లమెంటరీ పక్ష నేత నామా నాగేశ్వర రావు విమర్శించారు. భద్రాచలం–కోవూరు కొత్త రైల్వే లైన్‌‌‌‌కు 2012లో అనుమతులు వచ్చాయని, ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. ఐదేండ్లలో హైదరాబాద్‌‌‌‌కు ఎలాంటి పనులు చేస్తున్నారో బ్లూప్రింట్ కావాలన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇవ్వాలని డిమాండ్‌‌‌‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్, ఆర్వోబీ నిజామాబాద్ పనులు ఆగిపోయాయని నిజామాబాద్‌‌‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌‌‌ చెప్పారు. కాళేశ్వరంలో సొరంగాలు తవ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రైల్వే పనులకు లేవా అని మండిపడ్డారు. కరీంనగర్‌‌‌‌, నిజామాబాద్‌‌‌‌ మధ్య రైళ్ల సంఖ్య పెంచాలన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌‌‌‌ను అభివృద్ధి చేయాలని హైదరాబాద్‌‌‌‌ ఎంపీ అసదుద్దీన్‌‌‌‌ ఒవైసీ కోరారు. ఫలక్​నుమా–శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ మధ్య ఎంఎంటీఎస్‌‌‌‌ను పొడిగించాలని విజ్జప్తి చేశారు.  హైదరాబాద్ నుంచి బీజాపూర్, యశ్వంత్‌‌‌‌పూర్ మధ్య నడిచే ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు అన్ని స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జనగామ, భువనగిరి స్టేషన్లలో శాతవాహన ఎక్స్‌‌‌‌ప్రెస్ ఆపాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఘట్‌‌‌‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌‌‌‌ను పొడిగించాలన్నారు. జనగామ వరకు పుష్‌‌‌‌పుల్ ట్రైన్‌‌‌‌ను వేయాలని కోరారు.
 హైదరాబాద్–విజయవాడకు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌ రెడ్డి కోరారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం మోసం చేయకుండా వెంటనే మంజూరు చేయాలన్నారు. జగ్గయ్యపేట, మిర్యాలగూడ మధ్య ప్యాసింజర్ రైళ్లు నడపాలని విజ్ఞప్తి చేశారు. మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని, ఇంటర్‌‌‌‌ సిటీ, నారాయణాద్రి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లను ఆపాలని కోరారు. మహబూబ్​నగర్ పరిధిలో మన్నెకొండ, కురుమూర్తి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని, ఆ ప్రాంత పరిధిలోని స్టేషన్లలో రైళ్లు ఆపాలని ఎంపీ మన్నె శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి కోరారు.  తాండూరు, వికారాబాద్ పరిధిలో రైల్వే బ్యూటిఫికేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు.  నిలిపేసిన రైళ్లను మళ్లీ ప్రారంభించాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కోరారు. కొత్త లైన్లు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.  మేడ్చల్–మనోహరాబాద్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడిపించాలని మెదక్‌‌‌‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌‌‌‌ రెడ్డి కోరారు. సిద్దిపేట, సిరిసిల్ల మధ్య కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ గజ్వేల్ వరకే పూర్తయ్యిందని, దాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు.