వందే భారత్ ప్రాజెక్ట్.. బిడ్‌లో చైనా కంపెనీకి నో చాన్స్?

వందే భారత్ ప్రాజెక్ట్.. బిడ్‌లో చైనా కంపెనీకి నో చాన్స్?

న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ఇరు దేశాల సంబంధాల్లోనూ ప్రతిష్టంభనలు నెలకొన్న సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌తో సహా ప్రముఖ చైనీస్ మొబైల్ యాప్స్‌ను కేంద్రం నిషేధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మన దేశంలో డ్రాగన్ కంపెనీలు చేపట్టే పలు ప్రాజెక్టులకు కూడా అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాజాగా సెమీ హై స్పీడ్ ఇండిజీనస్ ట్రెయిన్ 18 ప్రాజెక్టుకు సంబంధించి చైనాకు చెందిన సీఆర్‌‌ఆర్‌‌సీ కంపెనీ బిడ్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని ఇండియన్ రైల్వేస్ భావిస్తున్నట్లు సమాచారం. రూ.1,500 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు బిడ్ దాఖలు చేయనున్న ఏకైక విదేశీ కంపెనీ సీఆర్‌‌ఆర్‌‌సీ కానుంది. అయితే ఈ సంస్థ బిడ్‌ను కన్సిడర్ చేయొద్దని రైల్వేస్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా 44 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను తయారు చేయనున్నారు. టెండర్ లిస్ట్‌లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేధా గ్రూప్‌తోపాటు ఎలక్ట్రోవేవ్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైకి చెందిన పవర్‌‌నెటిక్స్ ఎక్విప్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పోటీలో ఉన్నాయి. ‘సీఆర్‌‌ఆర్‌‌సీ బిడ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవచ్చు. మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్‌లో భాగంగా ఆ కంపెనీ బిడ్‌ను ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించే అవకాశాలు ఉన్నాయి’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.