
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన 10 నెలల రాధిక అనే పసికందుకు రైల్వే శాఖ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చింది. అయితే ఆమె 18 ఏళ్లు వచ్చిన తరువాత ఉద్యోగ బాధ్యతలు తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలో ఇంత చిన్న వయస్సులో జరిపిన కారుణ్య నియామకం ఇదేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చిన్నారి తండ్రి రాజేంద్ర కుమార్ భిలాయ్‌లోని రైల్వే యార్డులో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 1న ఆయన తన కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతను, అతని భార్య ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సందర్భాల్లో వారి కుటుంబీకులకు తక్షణమే సాయం అందించేందుకు కారుణ్య నియామకాలు చేపడతుంది రైల్వే శాఖ. రికార్డులో నమోదు కోసం జూలై 4న చిన్నారిని ఆమె కుటుంబీకులు రాయ్‌పూర్ రైల్వే డివిజన్‌కు తీసుకువచ్చారు. వేలిముద్రలు తీసుకుంటున్న సమయంలో ఆ చిన్నారి ఏడవడం అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది.