3 రోజుల్లో తమిళనాడు-ఆంధ్ర తీరంలో తుఫాను : వాతావరణ శాఖ హెచ్చరిక

3 రోజుల్లో తమిళనాడు-ఆంధ్ర తీరంలో తుఫాను : వాతావరణ శాఖ హెచ్చరిక

తమిళనాడులోని చెన్నై, దాని పొరుగు జిల్లాలలో భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు, ట్రాఫిక్ జామ్‌లు జలమయమయ్యాయి. తాజాగా డిసెంబర్ 1 - 4 మధ్య తమిళనాడు తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. చెన్నైతోపాటు తమిళనాడులోని మరో ఐదు జిల్లాల్లో ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలలో చెంగల్పట్టు, తిరువళ్లూరు, నాగపట్నం, రామనాథపురం, కాంచీపురం ఉన్నాయి.

సోషల్ మీడియాలో విజువల్స్ చెన్నై, తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో వర్షం కురుస్తున్నట్లు చూపించాయి. ప్రజలు రెయిన్‌కోట్‌లు ధరించి, గొడుగులు పట్టుకుని నీటితో నిండిన వీధుల్లో నడవడం కనిపించింది. ఈ క్రమంలోనే చెన్నైతోపాటు ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించగా.. ఈ రోజు మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

చెంబరంబాక్కం సరస్సు నుంచి నీటిని విడుదల చేయడంతో కాంచీపురం జిల్లాలోని అడయార్ నది ఒడ్డున ఉన్న లోతట్టు ప్రాంతాలు, ఆరు గ్రామాలకు వరద హెచ్చరిక జారీ చేసినట్లు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇక తమిళనాడులో గత కొన్ని వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెడ్ హిల్స్ సరస్సు, చైన్నైలోని పుఝల్ సరస్సు పూర్తి స్థాయికి చేరుకుంది. నవంబర్ 30న సరస్సు నుంచి దాదాపు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.