V6 News

తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఎండలు తగ్గే ఛాన్స్ ఉందా..?

తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన.. ఎండలు తగ్గే ఛాన్స్ ఉందా..?

హైదరాబాద్: తెలంగాణకు వాతావరణ శాఖ మూడు రోజులు వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండటంతో గాలిలోని విచ్ఛిన్నత కారణంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే.. వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా కొనసాగునుంది. దాదాపు వచ్చే మూడు నాలుగు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఉండొచ్చని IMD అంచనా వేసింది. ఈరోజు( ఏప్రిల్ 20, 2026) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత ఉంటుందని.. అక్కడక్కడ వడగండ్ల వర్షం కురిసే అవకాశంతో హెచ్చరికలు జారీ చేసింది.

సోమవారం రోజు.. కామారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, మెదక్, హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం, అక్కడక్కడ పిడుగు పాటు సంభవించే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Also Read : నగరవాసికి కాస్త ఊరట హమ్మయ్య.. వానొచ్చింది

అయితే.. ఈ జిల్లాల్లో ఎండలు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటాయని, 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం సమయంలోనే వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.