క్వీన్స్ పార్కును ముంచెత్తిన జోరు వాన.. హోటల్లోనే ఇరు జట్ల ఆటగాళ్లు

క్వీన్స్ పార్కును ముంచెత్తిన జోరు వాన.. హోటల్లోనే ఇరు జట్ల ఆటగాళ్లు

ఇండియా- వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోన్న క్వీన్స్ పార్కును జోరు వాన ముంచెత్తింది. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. వర్షం తగ్గితే కానీ ప్లేయర్లు స్టేడియానికి చేరుకోరు. అందునా ఆఖరి రోజు కావడంతో ఈరోజు ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ డ్రాగా ముగియనుంది. 

డ్రా అయితే టీమిండియాకు భారీ నష్టం

తొలి టెస్టులో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భార‌త్.. రెండో టెస్టులో విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. మ్యాచ్ జరిగితే విజయం లాంఛనమే. అదే డ్రాగా ముగిస్తే.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

 2023-25 సైకిల్‌లో భారత జట్టుకు ఇదే మొదటి సిరీస్. దీంతో క్లీన్‌స్వీప్ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. కానీ, అందుకు వరుణుడు అడ్డంకిగా మారారు. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన టీమిండియా 100 శాతం విన్నింగ్ పర్సెంటేజ్ అందుకుంది. రెండో టెస్టులోనూ గెలిస్తేనే దాన్ని 100గా కాపాడుకోగలదు. అదే డ్రాగా ముగిస్తే భారత జట్టుకు 33.33 శాతం పాయింట్లు మాత్రమే వస్తాయి. దీంతో టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ 66.66కి పడిపోతుంది.

ఆఖరి రోజు టీమిండియా విజయానికి 8 వికెట్లు అవసరం ఉండగా.. ఓటమి నుంచి తప్పించుకోవడానికి వెస్టిండీస్ 90 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన విండీస్ రోజంతా బ్యాటింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. కనీసం 50 ఓవర్ల ఆట అయినా జరగాలని అభిమానులు ఆశిస్తున్నారు.