
వికారాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ అని రెండు రోజుల క్రితం వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెప్పినట్లే వానలు జిల్లాను అతలాకుతలం చేశాయి. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురవడంతో ఎన్నడూ లేనంత వరదలు ముంచెత్తాయి. దీంతో వాగులు భయంకరంగా ప్రవహిస్తూ చిన్నపాటి విధ్వంసమే సృష్టిస్తున్నాయి.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యాలాల మండలం కోకట్ బ్రిడ్జీ తెగిపోయింది. బ్రిడ్జ్ ప్రారంభం నుంచి ఐదు మీటర్ల దగ్గర నడుములోతు వరకు సీసీ బెడ్ కొట్టుకుపోయింది. బ్రిడ్జి తెగిపోవడంతో తాండూరు నుంచి రాస్నం,- ముద్దయిపేట్ తదితర గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి.
మరోవైపు భారీ వరద కారణంగా తాండూరు మండలం ఓగిపూర్ గ్రామంలో నాపరాతి గనిలో కార్మికులు లారీలో చిక్కుకున్నారు. కార్మికులను కాపాడేందుకు వెళ్లిన కరణ్ కోట్ పోలీసుల వాహనం వరదలలో చిక్కుకుంది. వరద ఉధృతి పెరుగుతుండటంతో పోలీసులు ప్రమాదంలో చిక్కుకున్నారనే ఆందోళన నెలకొంది. తాళ్ల సాయంతో బయటికి లాగారు గ్రామస్తులు.
ALSO READ : ఉప్పొంగుతున్న మూసీ..వరద ప్రాంతాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి:
భారీ వర్షాలతో ముంచెత్తిన వరదలకు వికారాబాద్ జిల్లా విలవిలలాడుతోంది. పలు మండలాల్లో వర్షం భీభత్సం సృష్టించింది, వరధ ప్రవాహనికి రోడ్లు కొట్టుకుపోయాయి. బంట్వారం మర్పల్లి, కోట్పల్లి మండలాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బంట్వారంలోని నూర్నంపల్లి వాగు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, పసుపు, కంది పంటపొలాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.
సుల్తాన్ పూర్ వాగులో కొత్తపలి గ్రామానికి చెందిన వ్యక్తి గల్లంతు అయ్యాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం కోసం మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మర్పల్లి మండలంలోని కల్కోడా గ్రామం జల దిగ్బంధం అయ్యింది. ఇళ్ళలోకి వర్షపు నీరు రావడంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. నీటి ప్రవాహనికి నవాబుపేట మండలంలోని మూలవాడలో రోడ్డు ధ్వంసం అయ్యింది.