హైదరాబాద్ లో ఒక్కసారిగా వాన .. మరో రెండ్రోజులు ఉరుములతో కూడిన వాన  

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాన .. మరో రెండ్రోజులు ఉరుములతో కూడిన వాన  
  • మూసాపేటలో అధికంగా 2.0 సెం.మీ
  • హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  సిటీలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా వాన పడటంతో రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అయింది. మూసాపేట్, చర్లపల్లి, శేరిలింగంపల్లి, చందానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్​, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. మూసాపేటలో 2.0, చర్లపల్లిలో 1.2, శేరిలింగంపల్లిలో 1.1, చందానగర్​లో  0.80 సెం. మీల చొప్పున వర్షం పడింది. మరో రెండ్రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, ఉరుములతో కూడిన వాన పడే చాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ ​వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఘట్​కేసర్​లో తడిసిన వడ్లు 

ఘట్ కేసర్ :  ఘట్​కేసర్ మండల పరిధి ఎదులాబాద్, మాదారం తదితర గ్రామాల్లో వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం తడిసింది. గంటపాటు కురిసిన వర్షానికి అన్నదాతలు ఆగమాగం అయ్యారు. ధాన్యంపై కప్పేందుకు కవర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదనీరు చేరకుండా కాల్వలు కట్టారు. వరదనీరు రోడ్లపైకి వచ్చి చేరింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.

పిడుగుపడి బర్రె మృతి 

 ఏదులాబాద్​లో  పిడుగు పడి బర్రె చనిపోయింది. గ్రామానికి చెందిన పోచగాని సత్యనారాయణకు తన  ఇంటి వద్ద ఉన్న దొడ్డిలో బర్రెలను కట్టెశాడు. రాత్రి దొడ్డిలోని కొబ్బరిచెట్టు మీదుగా పిడుగు పడింది. చెట్టు కింద ఉన్న బర్రె మృతి చెందింది. దాదాపు 30 నుంచి 40 వేల విలువైన బర్రె చనిపోవడంతో సత్యనారాయణ బోరున విలపించాడు.