అకాల వర్షం ఆగంజేసింది..!

అకాల వర్షం ఆగంజేసింది..!

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు.
మంచిర్యాలలో అత్యధికంగా 10.1 సెం.మీ..
విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు.
ఎగిరిపోయిన ఇంటి పైకప్పులు.

వెలుగు నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీ వానలు కురిశాయి. అనేకచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మంచిర్యాలలోని కుందారంలో అత్యధికంగా 10. 1 సెం. మీ. వర్షపాతం రికార్డు కాగా.. జైపూర్లో 9.5 సెం. మీ. వాన పడింది.  మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గూడూరులో 8. 5 సెం. మీ.,  జోగులాంబ గద్వాలలోని తిమ్మనదొడ్డిలో 8 సెం. మీ.  వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని దొగ్గొండిలో 6.93 సెం . మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

పలు జిల్లాల్లో భారీ నష్టం

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ధాన్యం తడిసిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలో సుమారు 250 క్వింటాళ్ల వడ్లు తడిసి పోయాయి. మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి 3 వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసింది. జిల్లాలో 2.20 లక్షల టన్నులకు గాను1.52 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా 68 లక్షల టన్నుల ధాన్యం సెంటర్లలో ఉంది. వర్షానికి వడ్ల బస్తాలు, కుప్పలు పెద్ద ఎత్తున తడిశాయి. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.  జిల్లావ్యాప్తంగా వందలాది చెట్లు విరిగిపడ్డాయి. 150కి పైగా కరెంటు స్తంభాలు, 20కి పైగా ట్రాన్స్ ఫార్మర్లు నేలకూలినట్లు ఆఫీసర్లు ప్రాథమికంగా గుర్తించారు. రూ.10 లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ఎస్ఈ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు తెలిపారు.  పలు గ్రామాల్లో ఇండ్ల పైరేకులు గాలికి కొట్టుకుపోయాయి. జన్నారం మండలం రేండ్లగూడలో తెగిన కరెంట్ తీగలు తగిలి వృద్ధుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని ఈస్గంలో 132 కేవీ సబ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్రేకప్ విరిగి పోయింది. సిర్పూర్ టి మండలంలో కరెంట్ స్తంభాలు, చెట్టు విరిగిపడ్డాయి. ఇంటి పైకప్పులు లేచిపోయాయి. దహేగాం మండలంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది.

పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలంలో  అత్యధికంగా 6.43 సెం.మీ. వర్షపాతం నమోదైంది.  గోదావరిఖని కొత్తకూరగాయల మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పలు షెడ్ల గోడలు, రేకులు కూలి కాలువలో పడ్డాయి. గోదావరినది వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుప్పకూలింది. ధర్మారం  మార్కెట్​యార్డులో వడ్లు తడిసిపోయాయి.  జయశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు కూలాయి. ఇండ్ల పైకప్పులకు ఉండే  రేకులు, షెడ్లు కొట్టుకుపోయాయి.  పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలోని కారేగం, చిన్నకొడప్​గల్ లో 17 కరెంట్​స్తంభాలు నేలకొరిగాయి. పలువురి ఇళ్లపై కప్పులు, రేకులు ఎగిరిపోయాయి. గద్వాల జిల్లా అయిజ, కేటిదొడ్డి మండలాల్లోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వడ్లు తడిసిపోయాయి.

తరచుగా అకాల వర్షాలు

కరీంనగర్ జిల్లాలో ఈ నెల రోజుల్లోనే నాలుగు సార్లు అకాల వర్షం కురిసింది. వరి కోతలు మొదలయ్యే సమయాల్లోనే ఈదురు గాలులు.. దుమ్ముతోపాటు వడగళ్ల వాన కురిసింది. చేల మీద ఉన్న వరి పంట సుమారు 500 ఎకరాల్లో దెబ్బతింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు మరో రెండు మూడు రోజులపాటు అక్కడే ఉండి ఆరబెట్టుకోవాల్సి వచ్చింది. సుమారు 600 ఎకరాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. జగిత్యాల జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడుసార్లు, యాదాద్రి జిల్లాలో మార్చి, ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలల్లో ఆరుసార్లు అకాల వర్షాలు పడ్డాయి. యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 25,091 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. నల్గొండ జిల్లాలో అకాల వర్షాల కారణంగా మొత్తం 207 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. రూ. 51.75 లక్షల నష్టం జరిగినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. మెదక్​జిల్లాలో ఏప్రిల్​, మే నెలల్లో ఆరుసార్లు అకాల వర్షాలు పడ్డాయి. ఉమ్మడి మెదక్​ జిల్లాలో దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

తగ్గిన ఎండలు

అకాల వర్షాలతో 10 రోజులుగా దంచి కొడుతున్న ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి.  శనివారం నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. చాలా చోట్ల 40 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డయ్యాయి. ఖమ్మంలో 42.8, నల్గొండలో 42.6, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 42.5 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.  రాత్రి ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. శనివారం ఒక్క హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మినహా అన్నిచోట్ల 21 నుంచి 24 డిగ్రీల మధ్యే రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 27.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆది, సోమవారాల్లో ఉరుములు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరిన్ని వార్తల కోసం

ఉద్యోగం పోతే ఈఎంఐ రద్దు

11 అంకెల సెల్ ఫోన్ నెంబర్లు రాబోతున్నాయి

కరోనా కన్నా రాక్షసం ఈ మనుషులు..