మక్కలపై తీవ్ర ప్రభావం.. రైతులకు భారీ నష్టం

మక్కలపై తీవ్ర ప్రభావం.. రైతులకు భారీ నష్టం
  • వానలకు పంటలు ఆగం
  • మక్కలపై తీవ్ర ప్రభావం.. రైతులకు భారీ నష్టం
  • పత్తి, మిరపకు కష్టకాలం .. తెరపివ్వని వానలతో తెగుళ్లు వ్యాప్తి

హైదరాబాద్‌‌/ ఖమ్మం/వనపర్తి, వెలుగు: నిత్యం కురుస్తున్న వానలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చాలా చోట్ల చేన్లు నీట మునిగి తెగుళ్ల బారిన పడుతున్నాయి. ఈ సీజన్​లో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా ఇందులో వరి, పత్తి, మక్కలు, మిరప పంటలదే అగ్రభాగం. జులై, ఆగస్టులో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పొలాలు జాలుబట్టి పోయి దాదాపు 15లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తెంపిన మక్క పంట వర్షాలకు నానిపోయి రైతులకు నష్టం వస్తోంది. వానలతో పత్తి, మిర్చి పంటలు తెగుళ్లబారిన పడుతున్నాయి. తెల్లదోమ, పేనుబంక, కాండం ముక్కు పురుగు, పసుపు రోగంతో పత్తికి నష్టం వాటిల్లుతోంది. సీజన్ ప్రారంభం నుంచి భూమిలో తేమ ఎక్కువ ఉండడంతో మిర్చి పంటకు వేరు కుళ్లు, కాండం తెగుళ్లు సోకుతున్నాయి.


మక్క రైతుల తిప్పలు

మక్క పంట చాలా చోట్ల చివరి దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో చేతికి వచ్చింది. కంకులు తెంపి కల్లాలు, రోడ్ల పక్కన ఆరబోస్తున్నారు. రెండుమూడు రోజులుగా కురిసిన వర్షాలకు ఆరబోసిన మక్కలన్నీ తడిసి ముద్దయ్యాయి. రాష్ట్రంలో ఈసారి 6.21లక్షల ఎకరాల్లోని మక్క సాగు చేశారు. ఈ సీజన్‌‌ ప్రారంభంలో కురిసిన వానలకు జాలుబట్టి మక్క చేన్లు బాగా దెబ్బతిన్నాయి. వానాకాలంలో సాధారణంగా ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల దిగుబడి వస్తుంది. కానీ ఈసారి దిగుబడి ఎకరానికి సగటున15క్వింటాళ్లకే పరిమితమైంది. ఇలా ఇప్పటికే నష్టపోయిన రైతులను తాజా వర్షాలు మరింత దెబ్బతీస్తున్నాయి.

మార్కెట్‌‌లో మద్దతు దక్కట్లే

రెండేండ్లుగా సర్కారు మక్కలకు కొనకపోవడంతో పంటలకు మద్దతు ధర(ఎంఎస్పీ) దక్కడం లేదు. ప్రైవేటు వ్యాపారులే మక్క రైతులకు దిక్కవుతున్నారు. మక్కలు రకాన్ని బట్టి క్వింటాల్ కు కనిష్టంగా రూ.1,011 నుంచి  రూ.1,421 వరకు ధర పలకుతోంది. మోడల్‌‌ ధరలు క్వింటాల్‌‌ రూ.1,349 నుంచి రూ.2,070 వరకు ఉన్నాయి. అయితే ఎంఎస్పీ రూ.1,962 ఉండగా వ్యాపారులు ఆ ధర కట్టివ్వడం లేదు. మున్ముందు పరిస్థితి ఎట్లుంటదో అని రైతులు టెన్షన్​పడుతున్నరు.

తెర్లయితున్న మిరప నార్లు

నిరుడు ధర భారీగా పలకడంతో ఈసారి మూడు లక్షల ఎకరాలకు పైగా మిరప సాగైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌‌, వరంగల్‌‌ రూరల్‌‌, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో కూడా సాగు పెరిగిందని అధికారులు చెప్తున్నారు. వానలకు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనే దాదాపు 60 వేల ఎకరాల్లో మిరప పంట దెబ్బతిన్నట్లు సమాచారం. భూమి జాలువారి వేరు కుళ్లు, కాండం కుళ్లు పెరిగి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చాలా మొక్కలు చనిపోవడంతో మళ్లీ నాటాల్సిన పరిస్థితి. ఇప్పటికే ఎక్కువ ధరకు సీడ్‌‌ కొనుక్కొచ్చామని.. పెట్టుబడి మరింత పెరిగేలా ఉందని రైతులు అంటున్నరు.

వానలతో పత్తికి కష్టకాలమే..

రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వేసిన పత్తి చేన్లు కాత దశ నుంచి పత్తి వచ్చే దశలో ఉన్నాయి. వానల ప్రభావంతో గోదావరి పరిసర ప్రాంతాల్లోని ఆదిలాబాద్‌‌,  ఆసిఫాబాద్‌‌, నిర్మల్‌‌, నిజామాబాద్‌‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి,  ములుగు, వరంగల్‌‌, మహబూబాబాద్‌‌, భద్రాద్రి జిల్లాల్లో పత్తి సగానికి సగం దెబ్బతింది. వనపర్తి జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ ఒక్క పంటనే దాదాపు 12 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అధికవర్షాల వల్ల భూమిలో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల పూత, పిందె రాలిపోయి, కాయలు కుళ్లిపోతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే దూది వచ్చిన ప్రాంతాల్లో భారీ వానలకు తడిసి పత్తి నల్లగా మారే ముప్పు ఉందని రైతులు అంటున్నరు. ఇట్లనే వానలు కొడితే పత్తి చేన్లకు ఇబ్బందేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. 

పొట్ట దశలో వరికి ఇబ్బందే

వానాకాలం పంటల్లో 64లక్షల ఎకరాలకు పైగా సాగైన వరికి వానలకు ఇబ్బందిగా మారాయి. పొట్టదశలో ఉన్న పంటలపై ఎఫెక్ట్‌‌ పడుతోంది. చేన్లు అడ్డం పడేంత స్థాయిలో భారీ వర్షాలు వస్తే తీవ్ర నష్టం తప్పదని రైతులు అంటున్నారు. వరి పొలాలు పొట్టదశలో వానలు కురువడంతో పొట్టకుళ్లు రోగం, ఇప్పుడిప్పుడే ఈనిన వరికి మెడవిరుపుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

 పసుపు రోగంతో నష్టపోయా

ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి వేశా. పత్తికి పసుపు రోగం వచ్చి పాడైపోయింది. ఎకరానికి రూ.10 వేలు కౌలు, మరో రూ.25 వేలు పెట్టుబడి పెట్టా. ఎకరానికి రెండు క్వింటాళ్ల పత్తి కూడా పండని పరిస్థితి ఉంది. మిర్చి కూడా ఎదుగుదల లేదు. ముడత రోగంతో మొక్కలు సరిగ్గా పెరుగుతలేవు. 

తీగల ధనమూర్తి, 
కౌలు రైతు, మద్దులపల్లి

పెట్టుబడి వచ్చేట్టు లేదు

వానలతో మక్కలు తడిసిపోతున్నయి.a ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టినం. పెట్టుబడైనా వస్తదో రాదో. ఇప్పటికే మొదట కురిసిన వానలకు చేన్లు తెర్లయినయి. ఇప్పుడు పంట చేతికి వచ్చినంక వానతో దెబ్బపడుతోంది. నష్టపోయిన రైతులను సర్కార్ ఆదుకోవాలి.

-అజ్మీరా తావుర్యా, మహబూబాబాద్‌‌

కాయలు మురిగిపోతున్నయ్‌‌

మూడు ఎకరాల్లో పత్తి పెట్టినం. వానలకు ముందు కాసిన పత్తి కాయలు మురిగిపోతున్నయి. ఇప్పుడే కాయలు పగుల్తున్నయ్‌‌. పగిలిన కాయల్లోకి నీళ్లు పోతే పత్తి నల్లగా మారుతది. గింజలు మొలకలు వస్తయి. 

జె.వెంకట్‌‌రెడ్డి, రైతు, 
చౌటపల్లి, ఖమ్మం జిల్లా