చెడగొట్టు వానకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం

చెడగొట్టు వానకు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
  • 13 జిల్లాల్లో మిర్చి, మామిడి, వరి, మక్కపై తీవ్ర ప్రభావం
  • ఈదురు గాలులకు తోడు వడగండ్లతో భారీ లాస్​
  • మండలాల వారీగా సర్వే చేస్తున్న అగ్రికల్చర్​ ఆఫీసర్లు
  • లాగోడి కూడా మిగిలెటట్టు లేదని అన్నదాతల కన్నీళ్లు 
  • 4 ఏండ్లుగా ఫసల్​ బీమా అమలు చేయని రాష్ట్ర సర్కారు

నెట్​వర్క్​/హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నాలుగు రోజులుగా కురుస్తున్న చెడగొట్టు వానలు రైతులను నట్టేటముంచాయి. ప్రధానంగా మక్క, వరి, మిర్చి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కూరగాయలు, పండ్ల తోటలు, పసుపు తదితర పంటలూ దెబ్బతిన్నాయి. ఏ జిల్లాలో చూసినా నేలకొరిగిన చేన్లు, రైతుల కళ్లలో నీళ్లే కనిపిస్తున్నాయి. మండలాలవారీగా అగ్రికల్చర్​ ఆఫీసర్లు నష్టం అంచనా కోసం సర్వేలు నిర్వహిస్తున్నారు. రికాంలేని వానలు, ఈదురుగాలులు, వడగండ్ల బీభత్సంతో నష్ట తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నది.ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు తెలుస్తున్నది. 

13 జిల్లాల్లో భారీ నష్టం

ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 72.61 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వరి 56.44 లక్షల ఎకరాల్లో, మక్క 6.48 లక్షల ఎకరాల్లో, శనగ 3.64 లక్షల ఎకరాల్లో, పల్లి 2.42 లక్షల ఎకరాల్లో సాగైంది. నాలుగురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్ని పంటలపైనా ఎఫెక్ట్​ పడింది. 3.50 లక్షల ఎకరాల్లో మామిడి తోటలుండగా, వడగండ్లకు పిందెలు, కాయలు నేలరాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏరేందుకు సిద్ధంగా ఉన్న మిరపకాయలు కింద రాలిపోగా, కల్లాల్లో ఆరబోసిన మిర్చి నీటి పాలైంది. గురువారం కురిసిన చెడగొట్టు వానలు మొదట వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకే పరిమితమైనప్పటికీ.. శుక్ర, శనివారాల్లో రాష్ట్రమంతా విస్తరించాయి. దీంతో నష్ట తీవ్రత అంతకంతకూ పెరిగిపోయింది. ప్రధానంగా వికారాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట, జనగామ, సూర్యాపేట, వరంగల్‌‌‌‌‌‌‌‌, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌, భద్రాద్రికొత్తగూడెం,  ఖమ్మం జిల్లాల్లో భారీ నష్టం జరిగినట్లు తేలింది.  వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి  ఏరియల్​ సర్వే ద్వారా కేవలం వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అగ్రికల్చర్​ ఆఫీసర్లు నష్టం అంచనా వేసేందుకు మండలాలవారీగా సర్వే చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో నష్టంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. 

నిండా మునిగిన మిర్చి రైతులు.. 

ప్రధానంగా మక్క, మిర్చి, వరి, మామిడి పంటలు దెబ్బతినగా, నాలుగు జిల్లాల్లోని మిర్చి రైతులే రూ.100 కోట్ల మేర నష్టపోయారు. అగ్రికల్చర్​ ఆఫీసర్ల అంచనా మేరకు భూపాలపల్లి , ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 30 వేల కింటాళ్ల మిర్చి నేలపాలైంది.  ఈ మూడు జిల్లాల్లో కలిపి గోదావరి తీరంలో సుమారు 15 వేల ఎకరాల్లో రైతులు మిర్చి పండించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా చీడపీడల వల్ల 20, 25 క్వింటాళ్లు మాత్రమే పండింది. ఇటీవలే వేలాది ఎకరాల్లో కూలీల సాయంతో ఏరిన ఎండు మిర్చిని గోదావరి వెంట కల్లాల్లో ఎండబెట్టారు. ఇటీవలి వర్షాలకు గోదావరి తీరం వెంట సుమారు 30 వేల కింటాళ్ల మిర్చి తడిసిపోయింది. చాలాచోట్ల టార్పాలిన్లు కప్పినా గాలికి లేచిపోయి వరద నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన మిర్చి  నల్లగా మారుతున్నది. ప్రస్తుతం ఏ గ్రేడ్ మిర్చికి మార్కెట్​లో రూ. 23 వేల  ధర ఉండగా, తడిసిన మిర్చికి అందులో సగం కూడా వచ్చేలా లేదని రైతులు అంటున్నారు. ఎకరానికి కనీసం రూ.లక్ష దాకా నష్టం వాటిల్లిందని, సర్కారు ఆదుకోవాలని కన్నీళ్లు పెడుతున్నారు. మిర్చి తర్వాత మొక్కజొన్న కూడా పనికిరాకుండా పోయింది. సుమారు 2 లక్షల ఎకరాల్లో మక్క నేలమట్టమైనట్లు భావిస్తున్నారు. మామిడి తోటల్లో కాత బాగా ఉందని అనుకుంటున్న టైంలో వచ్చిన అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. మామాడి తోటల్లో సగానికి పైగా పిందెలు, కాయలు నేలరాలాయి. సాధారణంగా  12 లక్షల నుంచి 13 లక్షల టన్నుల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఇప్పుడు అందులో సగం కూడా వచ్చేలా లేదు. టమాటా, బీర, ఆకుకూరలు దెబ్బతినడంతో మార్కెట్లలో కూరగాయలకు షార్టేజ్​ ఏర్పడి, రేట్లు కూడా పెరిగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది.

చేతికొచ్చిన మిర్చి తడ్సిపోయింది

ఎకరానికి రూ.25 వేల చొప్పున నాలుగు ఎకరాలు కౌలు పట్టి మిర్చి పెట్టిన. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది రోగాల తోటి 15 నుంచి 20 క్వింటాళ్లే వచ్చింది. ఇక్కడ లేబర్ దొరక్కుంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన. వాళ్లకు తిండి పెట్టి నివాసం ఏర్పాటు చేసి మిర్చి కోయించి ఆరబెట్టిన. ఇగ మార్కెట్ కు తీస్కపోదమని లోడ్ చేస్తున్న టైమ్ లో మస్తు వానపడ్డది. పైనుంచి టార్పాలిన్ కప్పినా కింది నుంచి నీళ్లు జేరి మిర్చి అంతా తడ్సిపోయింది. ప్రస్తుతం క్వింటాలుకు రూ.20 వేల రేటు ఉన్నది. తడ్సిన మిర్చిని వారం రోజులు ఆరబెట్టే సరికి కలర్ నల్లబడి రేటు తగ్గుతది. కష్టమంతా ఒక్క వానతోటి నీళ్లపాలైంది.
- పడాల మధుకర్, చెన్నూర్, మంచిర్యాల జిల్లా

ఫసల్​ బీమా లేదు.. సర్కారు సాయం లేదు

నాలుగేండ్ల కిందటి వరకు రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా యోజన (పీఎంఎఫ్​బీవై ) అమలయ్యేది. దాని నుంచి రాష్ట్ర సర్కారు బయటకు రావడంతో అప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి పంట నష్టానికీ పరిహారం అందట్లేదు. ఫసల్‌‌‌‌‌‌‌‌ బీమాకు ప్రత్యామ్నాయంగా కొత్త స్కీం తీసుకొస్తామని సీఎం కేసీఆర్​ పలుమార్లు చెప్పినప్పటికీ ఇప్పటివరకు తేలేదు. కొత్త పంటల బీమా విధానంపై వ్యవసాయశాఖ ఇప్పటివరకు కసరత్తు చేసిందీ లేదు. నాలుగురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని రైతు సంఘాల నేతలు, ప్రతిపక్ష లీడర్లు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. వరికి ఎకరానికి రూ. 12 వేలు, మిర్చి, కూరగాయలకు రూ.35వేలు, మక్కకు రూ.15వేలు, పండ్ల తోటలకు రూ.50 వేలకు నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. తాజాగా పంట నష్టంపై ప్రభుత్వం సర్వే చేయిస్తుండడంతో ఈసారైనా ప్రభుత్వం పరిహారం ఇస్తుందా? ఎప్పట్లాగే మొండిచెయ్యి చూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మేమెట్ల బతకాలె..!

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ను చూసి బోరున విలపిస్తున్న ఈ మహిళా రైతు పేరు బానోతు బుల్లి. ఊ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రు మహబూబాబాద్​ జిల్లా పెద్ద వంగర మండలం బొమ్మకల్ శివారు రెడ్డి కుంట తండా. ఐదెకరాల్లో మిర్చి,  ఏడెకరాల్లో వరి, మక్క సాగుచేశారు. రెండురోజుల్లో మిర్చి ఏరుదామనుకుంటుండగా శనివారం రాత్రి వడగండ్ల వాన కురవడంతో చెట్టు మీద ఒక్క కాయ కూడా లేకుండా రాలిపోయింది. మక్క, వరి నేలమట్టమైనయ్​. సుమారు రూ.10లక్షల నష్టం వాటిల్లడంతో ఆదివారం పరామర్శకు వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను చూసి  బానోతు బుల్లి గుండెలవిసేలా రోదించింది. లక్షలకొద్దీ అప్పు చేసి పంటలు సాగు చేశామని, తీరా పంట చేతికి వచ్చే టైంలో వడగండ్లు పడి మొత్తం నేలపాలైందని, తాము బతికేది ఎట్లా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

పంటంతా పోయింది.. 

మాకున్న రెండెకరాల్లో మక్క వేసిన. ఇప్పటివరకు రూ.60 వేల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టిన. పంట చేతికి వచ్చే టైంలో చెడగొట్టు వాన  దెబ్బతీసింది. పంట మొత్తం నేలవాలిపోయింది.  
- కొలను మహేందర్ రెడ్డి, మర్రిపల్లిగూడెం, హనుమకొండ జిల్లా

ఏమీ మిగిలేటట్టు లేదు

గంగాధర, రామడుగు, కొత్తపల్లి మండలాల్లో 25 ఎకరాలకు పైగా మామిడి తోటలను కౌలుకు తీసుకున్న. గంగాధర  శివారులోని ఎనిమిది ఎకరాల మామిడి తోటను రూ.12 లక్షలకు కౌలుకు తీసుకున్న. చెట్టుకు కాసిన కాయలన్నీ రాళ్ల వానతో రాలిపోయాయి.  ఒక్క కాయ కూడా మిగల్లే. అప్పులే తప్ప ఏమీ మిగిలేటట్టు లేదు.  
- కోతి మహేశ్​,  కౌలు రైతు, కరీంనగర్​ జిల్లా


మిరప కొట్టుకపోయింది

50 క్వింటాళ్ల మిరపకాయలను గోదావరి నది చిన్న పాయలో కల్లం ఏర్పాటుచేసి ఆరబోసిన. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద రావడంతో కల్లాల కింద ఉన్న మిరపకాయలు కొట్టుకపోయినయ్​. ఉన్నవాటిని మార్కెట్​కు పట్టుకపోతే తడ్సినయన్న సాకుతోటి కొంటారో, కొనరోనని భయమేస్తున్నది.
- సాయి తేజ, వెంకటాపురం, ములుగు జిల్లా

నిండా మునిగినం.. ఆదుకోండి

10 ఎకరాల్లో మామిడి తోట పెట్టినం. పూత, పిందె పట్టే టైంలో తెగులు సోకి సగం పోయింది. ఇప్పుడు ఈదురు గాలులు, వడగండ్ల వానకు మొత్తం నాశనమైంది. రూ.8 లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టినం. సర్కారే ఆదుకోవాలె. లేదంటే బతికే పరిస్థితి లేదు.
- నాగరాజు, జానయ్య, నాగర్ కర్నూల్ జిల్లా

పసుపు తడిసింది..

నేను  రెండెకరాల్లో పసుపు సాగు చేసిన. ఎకరానికి సుమారు రూ. 70 వేల వరకు ఖర్చు వచ్చింది. తెగుళ్లు, రోగాల వల్ల పంట దిగుబడి చాలా తక్కువగా కేవలం 30 శాతం మాత్రమే వచ్చింది. వచ్చిన దిగుబడి కల్లంలో అరబెట్టాను. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పసుపంతా తడిసిపోయింది. రెండెకరాల సాగు కోసం ఖర్చు చేసిన లక్షా 40 వేల పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. వర్షానికి పంట నష్టపోయిన రైతులను సర్కారు ఆదుకోవాలే.
- రమేష్ రెడ్డి, బండలింగాపూర్​, జగిత్యాల