కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం.. ముంచెత్తిన మొంథా

కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం.. ముంచెత్తిన మొంథా
  • వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరిపంట, పత్తి చేన్లు
  • హుజూరాబాద్‌‌‌‌లో అత్యధికంగా 22.7 సెం.మీ వర్షం
  • కరీంనగర్, హుజూరాబాద్‌‌‌‌లో నీటమునిగిన కాలనీలు, రోడ్లన్నీ జలమయం
  • ఎల్ఎండీకి భారీ వరద, 14 గేట్లు ఎత్తివేత 

కరీంనగర్, వెలుగు: మొంథా తుపాన్‌‌‌‌ ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాను అతలాకుతలం చేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ముసురు వర్షం కురవగా ఆ తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ఏరియాల్లో 2 గంటల నుంచి, మిగతా ఏరియాల్లో సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు కుండపోత వర్షం కురుస్తోంది. కరీంనగర్ సిటీతోపాటు, హుజూరాబాద్ పట్టణంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హుజూరాబాద్ లో అత్యధికంగా రాత్రి 7 గంటల వరకు 22.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరింది. కేశవపట్నం, సైదాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో  వందలాది ఎకరాల్లో వరి పంట నేలవాలింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొన్ని చోట్ల ధాన్యం తడిసిముద్దయింది. తుపాన్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌తో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు.  అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ఏర్పాటు చేసినట్లు సాయం కోసం 0878 2997247 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. గంగాధర మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిశాయి. 

నేడు విద్యాసంస్థలకు సెలవుమొంథా తుఫాను  ప్రభావంతో భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ పమేలా సత్పతి సెలవు డిక్లేర్ చేసినట్లు డీఈఓ మొండయ్య తెలిపారు. 

సిరిసిల్లలో పొద్దంతా వానే 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాలో పొద్దంతా ముసురు పడింది. జిల్లా వ్యాప్తంగా 23.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇల్లంతకుంట మండలంలో 95.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, బోయినిపల్లి మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలవాలింది. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలని, పత్తి చేనులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డీఏవో అఫ్జల్ బేగం సూచించారు. 

జగిత్యాలలో తేలికపాటి వర్షం

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లావ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిశాయి. కొడిమ్యాల మండలం తిరుమలాపూర్‌‌‌‌లో అత్యధికంగా 6.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బీర్పూర్‌‌‌‌ మండలం కొల్వాయిలో 2.5 మి.మీ, మెట్‌‌‌‌పల్లిలో 2.3 మి.మీ., కథలాపూర్‌‌‌‌లో 2.0 మి.మీ, వెల్గటూర్‌‌‌‌, పుడూర్‌‌‌‌, గోదురులో 1.3 మి.మీ., ఎండపల్లి, పెగడపల్లి, మల్యాల, గోవిందారాంలో 1.0 మి.మీ. చొప్పున వర్షం కురిసింది. బుగ్గారం, జగిత్యాల పట్టణం లో తేలికపాటి జల్లులు కురిశాయి. మల్యాల మండలం కొండగట్టులోని ప్రధాన రహదారి సమీపంలో 11 కేవీ లైన్‌‌‌‌పై తాటిచెట్టు కూలింది.