జలదిగ్బంధంలో గురుకులం..వరద నీటిలో చిక్కుకున్న 500 మంది స్టూడెంట్లు

జలదిగ్బంధంలో గురుకులం..వరద నీటిలో చిక్కుకున్న 500 మంది స్టూడెంట్లు
  • తాడు సాయంతో బయటకు తీసుకొచ్చిన ఆఫీసర్లు

నల్గొండ/దేవరకొండ, వెలుగు : మొంథా తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండడంతో నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి గిరిజన గురుకులం వరద నీటిలో చిక్కుకుంది. పక్కనే ఉన్న తాటికోలు వాగు ఉధృతంగా పారడంతో ఆ నీరంతా గురుకులం పరిసరాల్లోకి చేరింది. మోకాలి లోతు నీరు చేరడంతో స్టూడెంట్లు భయాందోళనకు గురయ్యారు.

 విషయం తెలుసుకున్న నల్గొండ కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌‌ చంద్ర సిబ్బందితో గురుకులం వద్దకు చేరుకున్నారు. సుమారు 500 మంది స్టూడెంట్లను తాడు సాయంతో గురుకులం బయటకు తీసుకొచ్చి పక్కనే ఉన్న బీసీ వెల్ఫేర్‌‌ హాస్టల్‌‌కు తరలించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 

 కొమ్మేపల్లి గురుకులం ఘటనపై కోమటిరెడ్డి ఆరా..

నల్గొండ అర్బన్, వెలుగు : దేవరకొండ మండలం కొమ్మేపల్లి గురుకులం ఆవరణలోకి వర్షపు నీరు చేరిన ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి కలెక్టర్‌‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గురుకులం లోతట్టు ప్రాంతంలో ఉండడం, డిండి వాగు పక్కనే ఉండడం, ప్రహరీ లేకపోవడంతో నీరు చేరిందని కలెక్టర్‌‌ వివరించారు. రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్ల సహకారంతో స్టూడెంట్లు, సిబ్బందిని పక్కనే ఉన్న బీసీ హాస్టల్‌‌కు తరలించామని చెప్పారు. 

సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌‌ చంద్రపవార్‌‌ను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. మొంథా తుఫాన్‌‌ ప్రభావం తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.