- బిల్లు క్లియర్ చేసేందుకు 20 శాతం కమిషన్ డిమాండ్
- హైదరాబాద్ లోని మేడిపల్లి వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.1.90 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ
యాదగిరిగుట్ట, వెలుగు : ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకున్న యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడెపు రామారావును ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... యాదగిరికొండపైన ప్రసాదాల తయారీ మెషీన్ల యాన్యువల్ మెయింటెనెన్స్‌కు సంబంధించి కాంట్రాక్టర్‌కు రూ. 10 లక్షల బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు క్లియరెన్స్ కోసం సంతకం చేయాలని సదరు కాంట్రాక్టర్.. ఎలక్ట్రికల్ ఈఈ రామారావును కలిశాడు.
మొత్తం బిల్లులో 20 శాతం కమీషన్ ఇస్తేనే సంతకం చేస్తానని ఈఈ చెప్పడంతో కాంట్రాక్టర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు ఈఈకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని చెప్పడంతో... బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని మేడిపల్లి మెడ్‌ప్లస్ మెడికల్ హాల్ వద్దకు రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ మేడిపల్లికి వచ్చి ఈఈని కలిసి రూ. 1.90 లక్షలు ఇచ్చాడు.
అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఈఈ రామారావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామారావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆఫీసర్లు అతడిని యాదగిరిగుట్టలోని ఈఈ ఆఫీస్‌కు తీసుకొచ్చి సోదాలు చేశారు. ఇటీవల సంతకాలు చేసిన ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం కారణంగా సస్పెండ్ అయిన రామారావు మూడు నెలల క్రితమే డ్యూటీలో చేరారు. అనంతరం ఎండోమెంట్ ఎస్‌ఈగా ప్రమోషన్ పొందారు.
