- తెగిన కేఎల్ఐ కెనాల్
- నీట మునిగిన పంటలు
నెట్వర్క్, వెలుగు: ముంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. వాగులు పొంగి ప్రవహించగా, రాకపోకలు నిలిచిపోయాయి. చేతికి వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
దెబ్బతిన్న పంటలు..
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో చేతికొచ్చిన పత్తి, కోత దశకు చేరుకున్న వరి చేన్లు దెబ్బతిన్నాయి. 30 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో వరి చేన్లు దెబ్బతిన్నట్లు తెలిసింది. కూలీల కొరతతో పత్తి ఏరకపోవడంతో చేన్లలోనే ఉండగా, వర్షానికి పత్తి రాలి పడిపోయింది. మరికల్, నర్వ, ఊట్కూరు, మిడ్జిల్, దేవరకద్ర, కౌకుంట్ల, ధన్వాడ, మక్తల్ ప్రాంతాల్లో పత్తి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండడంతో నవాబుపేట, మహబూబ్నగర్ రూరల్, మిడ్జిల్, జడ్చర్ల, మరికల్ తదితర ప్రాంతాల్లో వరి పైర్లు నేలకొరిగాయి.
మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామ శివారులో ఎంజీకేఎల్ఐ కెనాల్ తెగిపోయింది. దీంతో 300 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. మిడ్జిల్ కేజీబీవీలోకి, జడ్చర్ల–-కోదాడ హైవేపైకి వరద నీరు చేరింది. బోయిన్పల్లి నుంచి జగబోయినపల్లి గ్రామానికి వెళ్లే మట్టి రోడ్డు కోతకు గురి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వేముల–-మసిగుండ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న వేముల వాగు పారడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అడ్డాకుల మండలం కన్మనూరు గ్రామానికి చెందిన సత్యమ్మకు చెందిన మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. నారాయణ పేట ఖాన్ పేటలో మట్టి మిద్దె కూలిపోవడంతో చింతామణి అనే మహిళకు గాయాలయ్యాయి. ఆమెను పోలీసులు, గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అతలాకుతలం..
నాగర్‌కర్నూల్ జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయి. కలెక్టరేట్‌లోకి కేఎల్ఐ కెనాల్ నీరు వచ్చి చేరింది. వంగూరు పోలీస్ స్టేషన్, ఎంపీడీవో ఆఫీసులు వరదనీటిలో చిక్కుకున్నాయి. వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. హైదరాబాద్–శ్రీశైలం ప్రధాన రహదారిపై బ్రాహ్మణపల్లి వద్ద చంద్రవాగు ఉధృతంగా ప్రవహించింది. డిండి ప్రాజెక్ట్ అలుగు పారడంతో మెయిన్ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమామహేశ్వరం కొండపై కొండచరియలు విరిగిపడ్డాయి. అమ్రాబాద్ మండలంలో పదర, మద్దిమడుగు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్, అచ్చంపేట, బల్మూరు, లింగాల, తెల్కపల్లి, ఉప్పునుంతల, వంగూరు, తాడూరు, తిమ్మాజీపేట, బిజినేపల్లి, కల్వకుర్తి, వెల్డండ మండలాల్లో డిండి వాగుతో పాటు ఇతర వాగులకు వరద రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగుల వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను కాపలా ఉంచారు.
నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాల్లో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. చంద్రవాగులో 10 బర్రెలు కొట్టుకుపోగా, తాడూరు మండలం గోవిందాయపల్లి వద్ద మేతకు వెళ్లిన బాల జంగయ్యకు చెందిన 12 గొర్రెలు కొట్టుకుపోయాయి. లింగాల మండలం అవుసలికుంట–-అంబటిపల్లి మధ్య ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని స్థానికులు తాళ్ల సహాయంతో కాపాడారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, వంగూరు, చారకొండ మండలాల్లో పర్యటించారు. కలెక్టర్ బదావత్ సంతోష్ కలెక్టరేట్లో కంట్రోల్ రూం నుంచి వర్షం ఎఫెక్ట్‌పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
సరళ సాగర్ సైఫన్లు ఓపెన్..
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి మదనాపూర్ మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టుకు ఆటోమేటిక్ సైఫన్లలో రెండు తెరచుకున్నాయి. 5 వేల క్యూసెక్కులు దిగువన ఉన్న ఊకచెట్టువాగు గుండా రామన్‌పాడు ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ఒక గేటును ఎత్తి మూడు వేల క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదిలినట్లు ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్ తెలిపారు. కొత్తకోట మండలం కానాయపల్లి వద్ద శంకరసముద్రం రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. దంతనూరు–-శంకరంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
