
- ఈసారి వానలు తక్కువే
- ఎల్‌నినో ఎఫెక్ట్‌తో దేశంలో తగ్గనున్న వర్షా లు
- స్కైమెట్ సంస్థ అంచనా
- సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని ప్రైవేట్ వెదర్ ఫోర్ క్యాస్ట్ ఏజెన్సీ ‘స్కైమెట్’ అంచనా వేసింది. ఎల్ నినో (దక్షిణ అమెరికా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు వేడెక్కడం) ప్రభావం కారణంగా ఈసారి ఆసియాలో పొడి వాతావరణం నెలకొంటుందని, దీనివల్ల మన దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. 2023 సీజన్ కు సంబంధించి ఈ మేరకు స్కైమెట్ సోమవారం వర్షపాత అంచనాలను విడుదల చేసింది. ఈసారి ఎల్ నినో ప్రభావం పెరుగనుండటంతో రుతుపవనాలు బలహీనపడతాయని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. వర్షపాతానికి సంబంధించి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఈ సీజన్ లో 94% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసినట్లు స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు.
‘‘జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు కొనసాగే వర్షాకాలం సీజన్ లో 88 సెంటీమీటర్ల వర్షపాతాన్ని దీర్ఘకాలిక (50 ఏండ్ల) సగటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇందులో 96% నుంచి 104% మధ్య వర్షపాతం నమోదైతే దానిని సాధారణంగా భావిస్తారు. అయితే, ఈ సారి వర్షాలు ఇంతకంటే తక్కువే పడతాయని అంచనా వేశాం” అని ఆయన వివరించారు. ‘‘గత నాలుగేండ్లుగా లా నినా (దక్షిణ అమెరికా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు చల్లబడటం) పరిస్థితి కారణంగా మన దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు లా నినా ముగిసిపోయి ఎల్ నినో మొదలుకావడంతో మన దేశంతో సహా ఆసియాలో వర్షపాతం తగ్గనుంది”అని పేర్కొన్నారు.
నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో లోటు వర్షపాతం
దేశంలో దాదాపు సగం సాగు భూముల్లో వర్షాలపై ఆధారపడే పంటలు సాగు చేస్తారు. ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తక్కువ వర్షపాతం నమోదు కానుండటంతో దేశంలోని నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ వెల్లడించింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో సీజన్ రెండో సగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని, ఈ సమయంలో వివిధ పంటలపై ప్రభావం పడుతుందని తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షపాతానికి సంబంధించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల నివేదిక ఇంకా విడుదల కావాల్సి ఉంది.