- టీజీ ఎన్పీడీసీఎల్ ముందస్తు చర్యలు
- ఇప్పటివరకు 2,337 ఎల్ఏలు ఏర్పాటు
- హైఓల్టేజీ సమస్యలకు చెక్
హనుమకొండ, వెలుగు: వర్షాకాలంలో మెరుపులు, పిడుగుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంటర్‌లింకింగ్ లైన్లు, సబ్‌స్టేషన్లలో సమస్యలు తలెత్తకుండా సంస్థ పరిధిలోని 16 సర్కిళ్లలో లైట్నింగ్ అరెస్టర్(ఎల్ఏ)లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బ్రేక్‌డౌన్లు తగ్గి వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నారు.
పిడుగులతో భారీ నష్టం..
టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో డొమెస్టిక్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, కమర్షియల్ కలిపి 70.29 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. విద్యుత్ సరఫరా కోసం 220 కేవీ సబ్‌స్టేషన్లు 44, 132 కేవీ సబ్‌స్టేషన్లు 99, 33 కేవీ సబ్‌స్టేషన్లు 1,528తో పాటు 3 వేలకు పైగా 11 కేవీ సబ్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి.
అయితే ప్రతి వర్షాకాలంలో పిడుగుల కారణంగా హై ఓల్టేజ్ ఏర్పడి ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్లు దెబ్బతినడం, ఇన్సులేషన్ ఫెయిల్ అవడం, వైండింగ్ కాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో రిపేర్లకు ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
రూ.10 కోట్లతో ఏర్పాటు..
పిడుగుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటివరకు సంస్థ పరిధిలో 2,337 లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట సగటున రూ.45 వేల చొప్పున మొత్తం సుమారు రూ.10 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం తదితర సర్కిళ్లలో ఈ ఏర్పాట్లు చేశారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు అవసరమైన మరిన్ని ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పిడుగుల వల్ల వచ్చే హైఓల్టేజీ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ లైన్లపై పడకుండా నేరుగా భూమిలోకి పంపించే సేఫ్టీ ఎక్విప్ మెంట్ గా ఈ లైట్నింగ్ అరెస్టర్స్ ఉపయోగపడతాయి వీటి వల్ల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు రక్షణ పొందుతాయి.
పిడుగులతో కరెంట్‌కు సమస్య రాదు
పిడుగుల వల్ల విద్యుత్ వ్యవస్థకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. లైట్నింగ్ అరెస్టర్లతో ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు రక్షణ పొందుతాయి. వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుతుంది.
- కర్నాటి వరుణ్ రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్-
