‘రేజ్ రూమ్‌‌’.. కోపం వస్తే దేన్నైనా పగలకొట్టొచ్చు

‘రేజ్ రూమ్‌‌’.. కోపం వస్తే దేన్నైనా పగలకొట్టొచ్చు

కొడితే..  కోపం ఎగిరిపోవాల్సిందే!

స్ట్రెస్‌‌, యాంగ్జయిటీ..  ఇప్పటి జనరేషన్‌‌ జీవితంలో ఒక పార్ట్ అయ్యాయి. ఇవి ఫ్రస్ట్రేషన్‌‌కి.. ఆ ఫ్రస్ట్రేషన్‌‌ కోపానికి దారితీస్తుంది. అయితే ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక మానసికంగా కుంగిపోతుంటారు కొందరు.  అలాంటి వాళ్ల కోసం పుట్టిందే ‘రేజ్ రూమ్‌‌’. చాప కింద నీరులా ఒక్కో దేశానికి విస్తరిస్తున్న ఈ కాన్సెప్ట్‌‌ నిజంగా వర్కవుట్ అయ్యేదేనా? చూద్దాం..ే

చేతికి దొరికిన దాంతో..  ఒక గదిలో కనిపించిన వస్తువునల్లా పగలకొట్టడమే ‘రేజ్‌‌ రూమ్‌‌’ కాన్సెప్ట్.  బ్రెజిల్‌‌లోని సావో పాలో ఈమధ్యే కొత్తగా ఓ ‘రేజ్‌‌ రూమ్‌‌’ ని ఏర్పాటు చేశారు. ఇది అక్కడివాళ్లకు కొత్తేమో!. కానీ, ప్రపంచానికి మాత్రం పాతే.  2008లో ‘గ్రేట్‌‌ రెసిషన్‌‌’ ఎఫెక్ట్‌‌తో జపాన్‌‌ ఎకానమీ బాగా దెబ్బతింది. చాలా మంది జాబ్స్‌‌ పోయాయి. ఆ టైంలో ఈ వెరైటీ కాన్సెప్ట్‌‌తో ముందుకొచ్చింది అక్కడి యువత.  2009 మొదట్లో ఈ కాన్సెప్ట్‌‌ని కొన్నిచోట్ల స్టార్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే..  జాబ్‌‌లు పోయి ఫ్రస్ట్రేషన్‌‌లో ఉన్న వాళ్లే ఎక్కువగా ఈ రేజ్‌‌ రూమ్‌‌కి ‘క్యూ’ కట్టారు. ఈ బిజినెస్‌‌ ఐడియా భలేగా వర్కవుట్ అయ్యింది. దీంతో జపాన్ నుంచి యూరప్‌‌, సౌత్ అమెరికా దేశాలకు ఈ కాన్సెప్ట్‌‌ పాకింది.  అమెరికాలోనూ చాలా ప్రాంతాల్లో ఇది నడుస్తోంది.

తుక్కు, తుక్కుగా..

రేజ్‌‌ రూమ్‌‌ని ఒక కంపెనీ లేదా కొందరు వ్యక్తులు నడిపిస్తారు.  ఈ రూమ్‌‌లో టీవీ, ఫ్రిడ్జ్‌‌, కంప్యూటర్లు, ప్రింటర్లు, గాజు సామాన్లను పెడతారు. అవి సెకండ్ హ్యాండ్‌‌వి అయి ఉండొచ్చు.  లేదంటే థర్మకోల్‌‌, బొమ్మలవి అయినా కావొచ్చు. ‘ఫ్రస్ట్రేషన్‌‌’కు కారణమైన మనుషుల్ని, లేదంటే విషయాల్ని ఆ వస్తువుల్లో ఊహించుకోమని కస్టమర్లతో చెప్తారు.  కోపం చల్లారేవరకు.. వాటిని ఇష్టం వచ్చినట్లు కొట్టమని నిర్వాహకులు ఎంకరేజ్‌‌ చేస్తారు.  ఇంకేం కసి తీరా వాటిని పగలకొట్టి..  తుక్కు చేసేయొచ్చు.  ఆ టైంలో తలకు హెల్మెట్‌‌, బాడీకి సేఫ్టీ సూట్‌‌ ఉంటాయి.  సో.. పగలకొట్టేవాళ్లకి దెబ్బలు తగులుతాయనే భయం ఉండదు.  ప్రస్ట్రేషన్‌‌తో రేజ్‌‌రూమ్‌‌ లోపలికి వెళ్లేవాళ్లు, కుదుటపడ్డ మనసుతో రిలాక్స్‌‌గా బయటకు వస్తుంటారు.  కాకపోతే ఇందుకోసం కొంత ఛార్జ్‌‌ చేస్తారు రేజ్‌‌ రూమ్‌‌ నిర్వాహకులు.

తప్పనిసరి అయితేనే..

రేజ్‌‌ రూమ్‌‌లను ‘యాంగర్‌‌ రూమ్‌‌’, ‘స్మాష్‌‌ రూమ్‌‌’ అని కూడా అంటారు. అయితే వీటిలోనూ రకరకాల వెర్షన్‌‌లు వచ్చాయి.  మన దేశంలో ‘బ్రేక్ రూమ్’ పేరుతో గురుగ్రామ్‌‌ (ఢిల్లీ)లో బెంగళూరులో ‘ది పంచ్‌‌ బాల్’ అని, ‘ది స్క్రీమింగ్‌‌ షాక్‌‌’ అని హైదరాబాద్‌‌లో..  ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే అవి ‘రేజ్‌‌ రూమ్‌‌’ లెవల్‌‌లో సక్సెస్‌‌ కాలేకపోయాయి.  కోపాన్ని చల్లార్చుకోవడమనే లాభంతో పాటే..  రేజ్‌‌ రూమ్‌‌ కాన్సెప్ట్‌‌తో కొంత నష్టం కూడా ఉందనేది కొందరి అభిప్రాయం.  ఇలాంటి పనులతో మనిషిలో ‘అగ్రెసివ్ బిహేవియర్’ మరింతగా పెరగొచ్చని అంటున్నారు. అలాగని ఇది తీసిపారేసేంత థెరపీ మెథడ్‌‌ కాదన్నది కొందరు సైకియాట్రిస్టుల మాట.

స్ట్రెస్‌‌ బాల్స్‌‌ వాడడం, గేమ్ రూమ్స్‌‌లో రిలాక్స్ కావడం, ఫ్రెండ్లీ టోర్నీలు, మ్యూజిక్‌‌ నేర్చుకోవడం, యోగా..  ఇవేవీ వర్కవుట్ కాని దశలో మాత్రమే ‘రేజ్‌‌ రూమ్‌‌’ని అప్రోచ్ కావడం బెటర్ అని సూచిస్తున్నారు. ‘ఈరోజుల్లో థెరపిస్ట్ ఆఫీస్‌‌లకు వెళ్లడానికి చాలామంది ఇష్టపడడం లేదు.  ఇలాంటి టైంలో రేజ్‌‌రూమ్‌‌ లాంటి డిఫరెంట్ ఐడియాలు కొంతవరకు వర్కవుట్ అవుతాయ’ని చెబుతున్నారు ఎయిమ్స్‌‌ సైకియాట్రిస్ట్‌‌ డాక్టర్‌‌ రమన్‌‌దీప్‌‌.

వీళ్లకు నో ఎంట్రీ

రేజ్‌‌రూమ్‌‌ కాన్సెప్ట్‌‌లో..  ఏరియాను బట్టి రూల్స్‌‌ అండ్ రెగ్యులేషన్స్‌‌ మారుతుంటాయి. కానీ, ప్రికాషన్స్,  కామన్‌‌ రూల్స్‌‌ మాత్రం కొన్ని ఉన్నాయి. పద్దెనిమిదేళ్ల వయసు దాటిన వాళ్లకు మాత్రమే రేజ్‌‌ రూమ్‌‌లోకి అనుమతి ఉంటుంది. 13 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్లైతే..  ఒకరిని(పెద్దవాళ్లను) వెంటపెట్టుకుని వెళ్లాల్సిందే.  చిన్నపిల్లలు, గర్భవతులు, తాగుబోతులు, జబ్బులు ఉన్న వాళ్లను ఈ రూమ్‌‌లోకి అనుమతించరు.