రాజన్నసిరిసిల్ల, వెలుగు: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా గెలిసిన అభ్యర్థులు తప్పకుండా చేయాల్సిన పనులను వివరిస్తూ రెండు గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో జీపీ బిల్డింగ్ ఎదురుగా సమస్యలను ఏకరువు పెడుతూ వాటిని రెండు నెలల్లో పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి నిధులు రావట్లే.. వచ్చినప్పుడు చేస్తా అని చెప్పకుండా గెలిచిన రెండు నెలల్లో పూర్తి చేయాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
కోనరావుపేట మండలం సుద్దాలలో గ్రామానికి చెందిన ఓ కుటుంబం పేరిట ‘మా ఓటును అమ్ముకోము, మేము అభివృద్ధి కోసం ఓటును నమ్ముకుంటాం.. దయచేసి డబ్బు, మందు ఆశ చూపేవారు మా ఇంటికి రాకండి’ అంటూ ఫ్లెక్సీలో పేర్కొన్నారు.
