నిజాం ప్రభువుకు లక్షలకు లక్షలు కప్పం కట్టిన సుసంపన్న సంస్థానం. ఈ కోట ఒక అద్భుత కట్టడం. దాని నిండా ఇంకెన్నో అద్భుతాలు. తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన కోటల్లో ఇది ఒకటి. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన రాతి కట్టడాల నిలయం రాజాపేట కోట. రాచరికపు మహోన్నత వైభవానికి, చరిత్రకు ఇది సజీవ సాక్ష్యం.
రాజాపేట సంస్థానం నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. ఇది ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో... హైదరాబాదు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజాం రాజ్యంలో ఉన్న అన్ని సంస్థానాల కన్నా ఎక్కువ రాబడి ఈ సంస్థానం నుంచే వచ్చేది. అంతేకాదు గొప్ప కట్టడాలున్న సంస్థానంగా కూడా పేరుండేది. ఇప్పటికీ ఎంతో మంది టూరిస్టులు కోటను చూసేందుకు వస్తుంటారు. కోటలోని కట్టడాల అద్భుత శిల్పకళా సంపద అప్పటి శిల్పుల గొప్పతనాన్ని చెప్తుంది. ఎందరో రాజుల దండయాత్రలను తట్టుకున్న ఈ సంస్థానం ఆధునిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా విరాజిల్లుతుంది.
ఎన్నెన్నో అద్భుతాలు:రాజా రాయన్న అనే రాజు ఈ కోటను 1775లో కట్టించాడు. కోట చుట్టూ ఎత్తైన శత్రుదుర్బేధ్యమైన రాతి ప్రహరీ ఉంటుంది. ఈ ప్రహరీ 'వాల్ ఆఫ్ చైనా'ను పోలినట్లు ఉంది. కోట లోపల అద్భుతమైన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రాజు నివాసం, అంతఃపురం, అద్దాలమేడ, అతిథి గృహం, స్నానవాటికలు, చార్మినార్ మెట్లను పోలిన గిరిగిరి మాల్ మెట్లు, కారాగారం, మంచి నీటి కొలను, సైనిక శిక్షణ స్థలం, రాజదర్బార్, సచివాలయం అద్భుతంగా ఉన్నాయి. సైనికులు పహారా కాయడానికి కోట చుట్టూ అనేక ఎత్తయిన బురుజులు కట్టించారు.
ప్రస్తుతం కోట, కోట లోపలి కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. పురావస్తు శాఖ ఈ కట్టడాన్ని వారసత్వ సంపదగా గుర్తించింది. రాజ నివాసం, అద్దాల మేడలో చెక్కిన శిల్పాలు సింహాసనం, కుర్చీలు ఆనాటి శిల్పకళా నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. రాజాపేట నుంచి గోల్కొండ కోట వరకు సొరంగ మార్గం ఉంది.
రాజాపేట కోట మొత్తం మూడు భాగాలుగా విభజిస్తే మెదటి భాగంలో గ్రామం ఉండేది. ఈ గ్రామం నుంచి రాజు అంతఃపురం లోపలికి వెళ్లేందుకు పెద్ద దర్వాజాతో కూడిన విశాల రాజ ప్రాంగణం ఉంటుంది. ఇది కోట రెండో భాగం. రాజు గారి అంతఃపురం తర్వాత మూడో వరుసలో సుమారు ముప్ఫై మీటర్లకు పైగా ఎత్తున సైనిక శిక్షణ, సమావేశ ప్రాంగణం ఉంటుంది.
రాజాపేట చరిత్ర: రాజా రాయన్న కోట కట్టించిన తర్వాత కోట లోపలి భాగంలో తన పేరు మీడే 'రాజా రాయన్న పేట' అనే గ్రామాన్ని ఏర్పాటు చేశాడు. ఆ పేరు కాలక్రమంలో రాజాపేటగా మార్పు చెందింది. రాజాపేట చుట్టూ ఎత్తైన రాతి గోడలు దాదాపు నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నాయి. ఈ కోట గోడ ఎత్తు సుమారు 20 మీటర్ల వరకు ఉంటుంది. కోట గోడల మధ్య పదుల సంఖ్యలో వెడల్పైన బురుజులు ఉన్నాయి.అంతఃపురానికి వెళ్లే ప్రవేశ ద్వారం కట్టించారు. వీటిపై సైనికులు పహారా కాస్తూ శత్రువుల నుంచి గ్రామాన్ని, కోటని రక్షించేవాళ్లు.
అద్దాలమేడ అంతఃపురం:ఈ మేడ అలంకరణలో రంగు రంగుల అద్దాలు వాడారు. దీని నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. రెండంతస్తుల్లో ఉంది. శిథిలమైన ఈ భవన నిర్మాణంపై అద్భుతమైన చెక్కడాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.. ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రాణి నివాసాన్ని 'గిరి గిరి మహల్' అని కూడా పిలుస్తారు. ఈ మహల్ మెట్లు చార్మినార్ పైకి ఎక్కడానికి ఉన్న మెట్లను పోలి ఉంటాయి. ఇవి 'ఏక్-ఏ' విధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడి ప్రజలు ఈ మెట్లను గిరి గిరి మెట్లు అని కూడా పిలుస్తుంటారు. కోట లోపల రాణి అద్దాలమేడ ముందు భాగంలో రాతితో కట్టించిన అందమైన ఈత కొలను మరో ప్రత్యేకత. రాతితో కట్టించిన ఈ కొలను లోపలికి దిగడానికి ఎక్కడానికి పెద్ద పెద్ద రాతి మెట్లు ఉంటాయి.
కవాతు ప్రాంగణం:దీనికి నాలుగు వైపులా పెద్ద పెద్ద రాతి బురుజులు ఉన్నాయి. సైనిక శిక్షణ ప్రాంగణం లోపలి భాగంలో ఒక అంతస్తు ఎత్తులో దాదాపు ఐదారు మీటర్ల వెడల్పుతో ఒక రోడ్డు ఉంది. మహారాజు ఈ రోడ్డుపై గుర్రం మీద తిరుగుతూ సైనిక శిక్షణను, కవాతును పరిశీలించేవాడు. ఈ అంతస్తుపైకి వెళ్లడానికి రాతితో కట్టిన పెద్ద మెట్లు కూడా ఉన్నాయి. రాజు సైనిక శిక్షణ చూడ్డానికి వీలుగా లోపలి భాగంలో ప్రధాన ద్వారం పైన రెండు సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనాలపై రాజు, రాణి కూర్చుని చూసేవాళ్లట.
ఆయుధాగారం.. వంటశాల.. కారాగారం:వంటశాల, ఆయుధాగారం కూడా సైనిక శిక్షణ ప్రాంగణంలోనే ఉండేవి. ఆయుధాగారం ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమై ఆనవాళ్లు లేకుండా కూలి పోయింది. కొన్ని అవశేషాలు వంటశాల నిర్మాణ శైలిని వివరిస్తున్నాయి. వంటశాల గోడలపై ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల బొమ్మలను చెక్కారు. వంటశాల గోడపై ఉన్న పైనాపిల్ బొమ్మ నాటి నిర్మాణ కళాత్మకతకు నిదర్శనం. శత్రువులను. నేరస్తులను బందీఖానలో శిక్షించేవాళ్లు. అది ప్రస్తుతం పూర్తిగా నేలమట్టం అయ్యింది.
కందకం:కోటగోడ చుట్టూ వెడల్పైన లోతైన పెద్ద కందకం ఉంది. అది ఇప్పటికీ మనం చూడొచ్చు. ఈ కందకంలోకి కోటకి పడమరగా ఉన్న గోపాల్ చెరువు నుంచి నీళ్లను మళ్లించే వాళ్లు. కందకంలో మొసళ్లు, విషసర్పాలను పెంచేవాళ్లు. ఈ కందకం ద్వారా కోటను రక్షించేవాళ్లట.
బురుజులు: కోట చుట్టూ అక్కడక్కడ రాతితో కట్టించిన బురుజులు ఉన్నాయి. శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి బురుజు నుంచి బయటకి రంధ్రాలు ఉండేవి. వాటి ద్వారా శత్రువుల దాడిని ఎదుర్కొనేవాళ్లు. వాటి ద్వారా సైనికులు తుపాకీ పేల్చడం, బాణాలు వేయడం, బరిసెలు విసరడం చేసేవాళ్లు. కోటకు ఐదు పెద్ద దర్వాజాలు ఉన్నాయి. వీటిలో మూడు దర్వాజాలు కోట బయటి నుంచి గ్రామంలోని రావడానికి, పోవడానికి, గ్రామం నుంచి రాజు అంతఃపురానికి వెళ్లే మార్గంలో మరొక పెద్ద దర్వాజా ఉంటుంది. సైనిక శిక్షణ, పరిపాలనా ప్రాంగణానికి వెళ్లడానికి అన్నింటికన్నా పెద్ద దర్వాజా ఉంది.
కోటలోని ఆలయాలు:రాజా రాయన్న రాజవంశీయులు శివ భక్తులు. కోట లోపలి భాగంలో శివాలయం, రామాలయం, హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం రాజవంశీయుల పూజలు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ పూజలు చేసినప్పుడు గ్రామస్తులకు అన్నదానం కూడా చేస్తారు. కోట బాగోగులకు ప్రతి నెలా కొంత డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారు. రాజా రాయన్న వంశీయులు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు.
పరిపాలన: సంస్థానం ఆధీనంలో ఏడు ప్రధాన గ్రామాలు ఉండేవి. వీటి పరిధిలోని చిన్న చిన్న గ్రామాలు ఎన్నో ఉన్నాయి. సంస్థానం పరిధిలోని గ్రామాల నుంచి పన్నులు వసూలు చేసి నిజాం ప్రభుత్వానికి కప్పం చెల్లించేవాళ్లు. సంస్థానంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. నిజాం ప్రభుత్వ కరెన్సీ సిక్కా చలామణిలో ఉండేది.
మోట బావి (ఏనుగుల బావి): అంతఃపురం పక్కన పెద్ద మోట బావి ఉంది.దీనిలో నీళ్లను మోటల ద్వారా బయటకు తీసేవాళ్లు. ఈ బావి నుంచి తోడిన నీళ్లే తాగునీటి, సాగు నీటి అవసరాలు తీర్చేవి. ఈ మోటలను కొట్టడానికి, నీటిని బావి నుంచి ఎత్తి పోయడానికి ప్రత్యేకమైన ఏనుగులు ఉండేవి. అందుకే దీన్ని ఏనుగుల బావి అని కూడా అంటారు.
వెలుగు,లైఫ్
