రాజస్థాన్‌లో పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

రాజస్థాన్‌లో పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

కరోనా తర్వాత ఆరోగ్య పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు, ఏ నిమిషానికి ఎలాంటి పరిస్థితుల్లో మృత్యువాత పడతారో ఊహించని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది. ఓ వ్యక్తి పేపర్ చదువుతూనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏం లాభం లేకపోయింది. రాజస్థాన్ లోని బద్మేర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మృతి చెందిన వ్యక్తిని గుజరాత్ కి చెందిన దిలీప్ కుమార్ మిదానిగా గుర్తించారు. వస్త్ర వ్యాపారం చేసే దిలీప్.. పంటి నొప్పి నేపథ్యంలో డాక్టర్ ను కలిసేందుకు ఆస్పత్రికి వచ్చాడు. వైద్యుడిని కలిసేందుకు వెయిట్ చేస్తూ.. బెంచ్ పై కూర్చొని పేపర్ చదువుతుండగా అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో అక్కడున్న క్లినిక్ సిబ్బంది.. చికిత్స కోసం వేరే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.

అంతకు మునుపు దిలీప్‌ కుమార్‌ బాగానే ఉన్నారని.. అలా కుప్పకూలిపోవడానికి కారణమేంటో తెలియడంలేదని అతడి సోదరుడు మహేంద్ర మదాని అన్నారు. బహుశా గుండెపోటు కావొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులంతా బద్మేర్‌కు చేరుకున్నారని.. శనివారమే అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన వివరించారు.