బాద్‌‌‌‌షా బట్లర్..224 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ చేసిన రాజస్తాన్

బాద్‌‌‌‌షా బట్లర్..224 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేజ్‌‌‌‌ చేసిన రాజస్తాన్
  • సూపర్​ సెంచరీతో చెలరేగిన జోస్
  • 2 వికెట్లతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌పై థ్రిల్లింగ్ విక్టరీ
  • నరైన్ తొలి వంద వృథా

కోల్‌‌‌‌కతా : ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్  (60 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 6 ఫోర్లతో 107 నాటౌట్‌‌‌‌) మరోసారి మ్యాజిక్ చేశాడు.  ఛేజింగ్‌‌‌‌లో తనకు తిరుగులేదని.. బాదుడులో తానే బాద్‌‌‌‌షానని  మళ్లీ నిరూపించుకున్నాడు. 224 రన్స్ భారీ ఛేజింగ్‌‌‌‌లో 121/6తో ఓటమి ఖాయం అనుకున్న జట్టును వీరోచిత బ్యాటింగ్‌‌‌‌తో.. అద్భుత సెంచరీతో గెలిపించాడు. దాంతో ఐపీఎల్‌‌‌‌లో మరోసారి అత్యధిక టార్గెట్‌‌‌‌ను ఛేజ్‌‌‌‌ చేసిన రాజస్తాన్‌‌‌‌ రాయల్స్ లీగ్‌‌‌‌లో ఆరో విక్టరీ సొంతం చేసుకుంది. వెస్టిండీస్ ఆల్‌‌‌‌రౌండర్ సునీల్ నరైన్ (56 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు

6 సిక్సర్లతో 109) ఈ ఫార్మాట్‌‌‌‌లో తొలి సెంచరీ సాధించినా కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌ రైడర్స్‌‌‌‌ గట్టెక్కలేకపోయింది. మంగళవారం ఈడెన్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో జరిగిన మ్యాచ్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ రెండు వికెట్ల తేడాతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తొలుత కేకేఆర్ 20 ఓవర్లలో 223/6 స్కోరు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో అవేశ్‌‌‌‌ ఖాన్‌‌‌‌, కుల్దీప్ సేన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రాయల్స్ 20 ఓవర్లకు 224/8 స్కోరు చేసి గెలిచింది. బట్లర్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆ ఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.  

నరైన్‌‌‌‌ ధనాధన్

ఆల్‌‌‌‌రౌండర్ సునీల్ నరైన్ విధ్వంసకర బ్యాటింగ్‌‌‌‌తో కేకేఆర్ భారీ స్కోరు చేసింది.  టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌కు సరైన ఆరంభం లభించలేదు. రెండో బాల్‌‌‌‌కే పరాగ్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఫిల్ సాల్ట్ (10) ఇబ్బంది పడ్డాడు. నాలుగో ఓవర్లో అవేశ్ పట్టిన అద్భుతమైన రిటర్న్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు ఔటయ్యాడు. అవేశ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లోనే తొలి బౌండ్రీ నరైన్ జోరు పెంచాడు. మరోవైపు వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన యంగ్‌‌‌‌స్టర్ అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువంశీ (30) కూడా ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. బౌల్ట్‌‌‌‌ ఓవర్లో మూడు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కుల్దీప్ సేన్ బౌలింగ్‌‌‌‌లో నరైన్‌‌‌‌ వరుసగా 6,4తో మరింత స్పీడు పెంచగా.. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 56/1తో ముగించింది. స్పిన్నర్లు అశ్విన్,  చహల్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసి సునీల్‌‌‌‌ షాట్లు కొట్టాడు.

లాంగాన్‌‌‌‌, లాంగాఫ్ మీదుగా గ్రౌండ్ షాట్లు కొడుతూ ఫీల్డర్లకు పని పెట్టాడు. ఎనిమిదో ఓవర్లో అశ్విన్‌‌‌‌కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన అతను  చహల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో లాంగాఫ్‌‌‌‌ మీదుగా సిక్స్‌‌‌‌ రాబట్టాడు. అశ్విన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లోనూ బంతిని స్టాండ్స్‌‌‌‌కు పంపి 29 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా 10 ఓవర్లకే స్కోరు వంద దాటింది. అయితే, క్రీజులో కుదురుకున్న రఘువంశీని ఔట్ చేసి న కుల్దీప్ సేన్‌‌‌‌ రెండో వికెట్‌‌‌‌కు 85  రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. అయినా వెనన్కుతగ్గని నరైన్‌‌‌‌.. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో 6, 4, 4తో రెచ్చిపోయాడు.

కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (11) ఫెయిలైనా చహల్‌‌‌‌ వేసిన 16వ ఓవర్లో 6, 4, 6, 4తో 23 రన్స్‌‌‌‌ రాబట్టిన నరైన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని జోరు చూస్తుంటే  కోల్‌‌‌‌కతా 250 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, చివర్లో రాయల్స్ బౌలర్లు పుంజుకున్నారు. ఆండ్రీ రసెల్ (13)ను అవేశ్‌‌‌‌ స్లో బాల్‌‌‌‌తో వెనక్కుపంపగా.. నరైన్‌‌‌‌ను పదునైన యార్కర్‌‌‌‌‌‌‌‌తో బౌల్ట్‌‌‌‌ క్లీన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ చేశాడు. అవేశ్‌‌‌‌ వేసిన 19వ ఓవర్లలో రింకూ సింగ్‌‌‌‌ (20) 6, 4, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్ (8) ఫోర్‌‌‌‌‌‌‌‌ కొట్టడంతో 16 రన్స్‌‌‌‌ వచ్చాయి. చివరి ఓవర్లో వెంకటేశ్‌‌‌‌ ఔటైనా రింకూ సిక్స్‌‌‌‌ సహా 9 రాబట్టడంతో స్కోరు 220 దాటింది. 

బట్లర్ వదల్లే..

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో రాజస్తాన్ రాయల్స్ దూకుడుగా ఆడినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా బట్లర్ పట్టు వదలకుండా పోరాడి జట్టును గెలిపించాడు. ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌‌‌గా ఓపెనింగ్‌‌కు వచ్చిన అతను మొదట ప్రశాంతంగా ఆడినా చివరి ఆరు ఓవర్లలో తన విశ్వరూపం చూపెట్టాడు. కేకేఆర్ బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాడు.  తొలుత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19) తొలి ఓవర్లో రెండు ఫోర్లు, వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్లో వరుసగా 6,4తో  దూకుడు చూపెట్టాడు. కానీ, తర్వాతి బాల్‌‌‌‌కు మరోషాట్‌‌‌‌కు  ట్రై చేసి శ్రేయస్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చాడు.

మరో ఎండ్‌‌లో బట్లర్ క్రీజులో కుదురుకునే ప్రయత్నం చేయగా.. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (12) ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. ఐదో ఓవర్లో నరైన్‌‌‌‌కు చిక్కాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇన్‌‌‌‌ఫామ్ బ్యాటర్ రియాన్ పరాగ్ (34) పవర్ ఫుల్ షాట్లతో అలరించాడు.  వైభవ్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 23 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. దాంతో  పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే రాయల్స్‌‌‌‌ 76/2 స్కోరు చేసింది. హర్షిత్ ఓవర్లోనూ 6,4 రాబట్టిన అతను భారీ షాట్ ఆడబోయి రసెల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో మూడో వికెట్‌‌‌‌కు 50 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది.

నాలుగు బాల్స్ తర్వాత నరైన్‌‌‌‌.. ధ్రువ్ జురెల్‌‌‌‌ (2)ను ఎల్బీ చేయడంతో  100 రన్స్ వద్ద రాయల్స్‌‌‌‌  నాలుగో వికెట్‌‌‌‌ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌లో ముందుకొచ్చిన అశ్విన్ (8) ప్రభావం చూపలేకపోయాడు. గత మ్యాచ్‌‌‌‌లో రాయల్స్‌‌‌‌ను గెలిపించిన షిమ్రన్ హెట్‌‌‌‌మయర్‌‌‌‌‌‌‌‌ (0) సైతం ఫెయిలయ్యాడు. 13వ ఓవర్లో చక్రవర్తి వరుస ఓవర్లలో ఈ ఇద్దరినీ ఔట్ చేయడంతో రాజస్తాన్‌‌‌‌ 121/6తో డీలా పడింది. 36 బాల్స్‌‌లో 96 రన్స్‌‌ అవసరమైన ఈ టైమ్‌‌‌‌లో బట్లర్ ఒక్కసారిగా తన బ్యాట్‌‌‌‌కు పని పెంచాడు. చక్రవర్తి వేసిన 15వ ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టాడు.

రసెల్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో బట్లర్, పావెల్ (26) చెరో సిక్సర్ రాబట్టి రాయల్స్‌‌‌‌ను రేసులోకి తెచ్చారు. నరైన్ వేసిన 17వ ఓవర్లో పావెల్ వరుసగా 4, 6, 6 కొట్టి  ఔటవగా.. చివరి మూడు ఓవర్లలో  రాజస్తాన్‌‌‌‌కు 46 రన్స్‌‌‌‌ అవసరం అయ్యాయి. స్టార్క్ వేసిన 18వ ఓవర్లో బౌల్ట్‌‌‌‌ (0) రనౌటైనా బట్లర్ 6, 4 కొట్టాడు. బైస్‌‌‌‌ రూపంలో మరో ఫోర్ సహా 18 లభించడంతో సమీకరణం 12 బాల్స్‌‌‌‌లో 28 రన్స్‌‌‌‌గా మారింది. హర్షిత్ వేసిన 19వ ఓవర్లో 6, 4, 6 కొట్టిన  కేకేఆర్ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. 
చివరి ఓవర్లో 9 రన్స్‌‌ను కాపాడేందుకు   చక్రవర్తి బౌలింగ్‌‌ చేయగా.. ఫస్ట్ బాల్‌‌‌‌కే  జోస్ సిక్స్ కొట్టాడు. కానీ, వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడటంతో టెన్షన్ పెరిగింది. ఐదో బాల్‌‌‌‌కు డబుల్, లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు సింగిల్‌‌‌‌తో బట్లర్ జట్టును గెలిపించాడు.

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌‌‌కతా : 20 ఓవర్లలో 223/6 (నరైన్ 109, అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ 30, అవేశ్ 2/35).
రాజస్తాన్ :   20 ఓవర్లలో 224/8 (బట్లర్ 107*, పరాగ్ 34, నరైన్ 2/30)