రాజస్థాన్ మంత్రి అల్టిమేటం.. న్యాయం జరగకుంటే రాజీనామా

రాజస్థాన్ మంత్రి అల్టిమేటం.. న్యాయం జరగకుంటే రాజీనామా

రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామంలో తొమ్మిదేళ్ల దళిత విద్యార్థి మృతి ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఈ కేసుపై ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపిస్తామని గురువారం వెల్లడించారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వీటికి అదనంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున  మరో రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామని తెలిపారు.

న్యాయం జరగకుంటే.. మంత్రి పదవికి రాజీనామా

ఈ ఘటన నేపథ్యంలో  రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజేంద్ర గుఢా సంచలన వ్యాఖ్యలు చేశారు.  జాలోత్ జిల్లా దళిత బాలుడి కుటుంబానికి న్యాయం జరగకుంటే.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాజేంద్ర గుఢా ఇటీవల బీఎస్పీ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు.

ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల చనిపోలేదంటూ.. 

మరోవైపు ఈ ఘటన చోటుచేసుకున్న సురానా గ్రామంలోని సరస్వతీ విద్యామందిర్ పాఠశాల గుర్తింపును రద్దు చేశారు. ఈనేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం నిరసనలు మరో మలుపు తిరిగాయి. జాలోర్ జిల్లా కేంద్రంలోని మక్ లేశ్వర్ మహాదేవ్ మఠంలో 36 కులాలకు చెందిన వందలాది మందితో భారీ జన సభను నిర్వహించారు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్ల దళిత బాలుడు చనిపోలేదని.. ఆ బాలుడు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో  బాధపడుతున్నాడని జనసభకు హాజరైన వారు వ్యాఖ్యానించారు. బాలుడి మృతి ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని కోరారు. సభా స్థలి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ ను కలిసి  ఈమేరకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. 

ఏమిటీ ఘటన.. 

జాలోర్ జిల్లా సురానా గ్రామంలో ఉన్న సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో సదరు దళిత విద్యార్థి మూడోతరగతి చదివేవాడు. ఆ పాఠశాల ఉపాధ్యాయుడు  ఛైల్ సింగ్ .. తన కోసం ప్రత్యేక తాగునీటి కుండను పెట్టుకునేవాడని అంటున్నారు. జులై 20న విద్యార్థికి దాహం వేయడంతో టీచర్ కుండలోని నీటిని తాగాడని.. ఛైల్ సింగ్ ఆగ్రహించి కొట్టినందు వల్లే చనిపోయాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉపాధ్యాయుడు ఛైల్ సింగ్ కొట్టడంతో బాలుడి చెవిలో గాయమై రక్తం కారిందని తెలిపారు. కంటి భాగంపైనా గాయం అయిందన్నారు. ఈమేరకు అభియోగాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జులై 20 నుంచి 23 రోజుల పాటు బాలుడికి ఆరు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా బాలుడి చెవి నొప్పి తగ్గలేదు.  చివరకు ఆగస్టు 13న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచాడు.  

ఆధారాలు లేవంటున్న జాలోర్ జిల్లా ఎస్పీ..

ఉపాధ్యాయుడు ఛైల్ సింగ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) చట్టంలోని ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే కుండలోని నీళ్లు తాగినందుకే దళిత బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టాడు అనేందుకు ఆధారాలు లేవని జాలోర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ మీడియాకు తెలిపారు. ఆ బాలుడు క్లాస్ రూంలో అల్లరి చేస్తుంటే చెంపదెబ్బ కొట్టానని దర్యాప్తులో ఉపాధ్యాయుడు ఛైల్ సింగ్ చెప్పాడని ఆయన వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే అసలు విషయం తెలుస్తుందన్నారు. ‘‘ సరస్వతీ విద్యామందిర్ పాఠశాలలో తరగతి గదుల బయట వాటర్ ట్యాంక్, దానికి కుళాయిలు ఉన్నాయి. మంచినీళ్ల కోసం కుండ ఏమీ లేదని విద్యార్థులు చెప్పారు’’ అని ఎస్పీ హర్షవర్ధన్ వివరించారు.