Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌లో సూర్యవంశీ క్రేజ్.. 14 ఏళ్ళ కుర్రాడి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆరు గంటల డ్రైవింగ్

Vaibhav Suryavanshi: ఇంగ్లాండ్‌లో సూర్యవంశీ క్రేజ్.. 14 ఏళ్ళ కుర్రాడి కోసం ఇద్దరు అమ్మాయిలు ఆరు గంటల డ్రైవింగ్

ఐపీఎల్ 2025లో తన బ్యాటింగ్ తో ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసిన 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ క్రేజ్ రోజు రోజుకీ పెరిగి పోతుంది. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఐపీఎల్ లో సంచలనంగా మారాడు. వైభవ్ ఫామ్ ఐపీఎల్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన అండర్-19 టోర్నీలో ఒక భారీ సెంచరీతో సహా ఐదు  మ్యాచ్ ల్లో 355 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫార్మాట్ ఏదైనా వైభవ్ దూకుడు ముందు బౌలర్లు కుదేలైపోతున్నారు. ఈ బీహార్ కుర్రాడికి ఇండియాలోనే కాదు ఇంగ్లాండ్ లోనూ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.

ఆన్య, రివా అనే ఇద్దరు అమ్మాయిలు వైభవ్ ను కలవడానికి తెగ ఆసక్తి చూపించారు. వీరిద్దరూ ఈ 14 ఏళ్ళ కుర్రాడిని కలవడానికి  వూస్టర్‌కు ఆరు గంటల రోడ్ ట్రిప్ పూర్తి చేశారు. రాజస్థాన్ రాయల్స్ పింక్ జెర్సీలు ధరించి ఈ ఇద్దరు అమ్మాయిలు వైభవ్ సూర్యవంశీతో  ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటీవలే ముగిసిన అండర్-19 యూత్ వన్డే సిరీస్‌లో సూర్యవంశీ అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ 3-2 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ప్రస్తుతం జూలై 12న బెకెన్‌హామ్‌లోని కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమయ్యే యూత్ టెస్ట్ సిరీస్‌కు సూర్యవంశీ ఇప్పుడు సిద్ధమవుతున్నాడు.

ALSO READ : టీ20ల్లో దీప్తి శర్మ సరికొత్త చరిత్ర..

ఐపీఎల్ 2025 లో వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ళ వయసులోనే ఈ మెగా టోర్నీలో ఆడిన అతి పిన్న వయస్కుడిగా నిలిచి సంచలనంగా మారాడు. లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో అరంగేట్రం చేసిన వైభవ్ ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. సన్ రైజర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి ఫ్యూచర్ స్టార్ అంటూ కితాబులందుకున్నాడు. ఇలాగే వైభవ్ ఫామ్ కొనసాగితే మరో రెండేళ్లలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు.