
న్యూఢిల్లీ: నలుగురు ఫారిన్ క్రికెటర్లు లీగ్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బంది పడుతున్న రాజస్తాన్ రాయల్స్ ఇతర టీమ్స్ నుంచి ప్లేయర్లను అప్పుగా తెచ్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ‘మిడ్ సీజన్ ప్లేయర్ ట్రాన్స్‌ఫర్’ ఆప్షన్‌ను ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు పలు ఫ్రాంచైజీలకు లెటర్ రాసింది. గాయాల వల్ల బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బబుల్‌లో ఉండలేక లివింగ్‌స్టోన్ జట్టును వీడితే.. ఇండియాలో కరోనాకు భయపడి ఆండ్రూ టై స్వదేశం వెళ్లిపోయాడు. దాంతో, ప్లేయర్ లోన్ ద్వారా ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసుకోవాలని చూస్తోంది. ‘రాజస్తాన్ రాయల్స్ ప్లేయర్లను లోన్‌గా తెచ్చుకోవాలని చూస్తోంది. ఇందుకోసం మిగిలిన ఫ్రాంచైజీలకు లెటర్స్ పంపింది. కానీ ప్రస్తుతానికి ఏది డిసైడ్ అవ్వలేదు’ అని రాయల్స్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఫుట్‌బాల్ క్లబ్స్ మాదిరిగా.. లీగ్ మధ్యలో ఒక టీమ్ నుంచి మరో టీమ్‌కు ప్లేయర్లను మార్చుకునే అవకాశం ఫ్రాంచైజీలకు ఐపీఎల్ కల్పించింది. ఈ మిడ్ సీజన్ ప్లేయర్ ట్రాన్స్‌ఫర్ విండో సోమవారమే మొదలైంది. రూల్స్ ప్రకారం ఈ సీజన్‌లో తమ టీమ్‌కు రెండు కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు (క్యాప్డ్, అన్‌క్యాప్డ్) ట్రాన్స్‌ఫర్‌కు అర్హులు. అయితే, ట్రాన్స్‌ఫర్ అయిన క్రికెటర్లు తమ హోమ్ టీమ్‌కు అపోజిట్‌గా మాత్రం ఆడకూడదు. లాస్ట్ సీజన్స్‌లో ఈ ఆప్షన్‌ను ఎవ్వరూ వినియోగించుకోలేదు.