SRH vs RR: న్యూ చండీగఢ్ వేదికగా ఈరోజు ( 2026, మే 27న) ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన 'ఎలిమినేటర్' పోరు జరగనుంది. ఒకవైపు ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. మరోవైపు ప్లేఆఫ్స్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్న రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫైయర్-2 లో తలపడే అర్హత సాధిస్తుంది. ఇక ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
చరిత్రను తిరగరాయాలనే కసితో సన్‌రైజర్స్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పదేళ్ల క్రితం (2016లో) సృష్టించిన చారిత్రక రికార్డును ఈసారి మళ్లీ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి, ఆపై కప్పు గెలిచిన ఏకైక జట్టుగా ఆరెంజ్ ఆర్మీ రికార్డు నేటికీ చెక్కుచెదరలేదు. దానికి తోడు ఈ ఐపీఎల్ 2026 లీగ్ దశలో రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ జట్టుదే పైచేయి సాధించింది.
ఎలిమినేటర్లలో రాజస్థాన్, సన్‌రైజర్స్ రికార్డులు:
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లలో 2–2తో సమానంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు ఎలిమినేటర్లలో రెండింటిలో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది.
* 2013: రాజస్థాన్ తమ చరిత్రలోనే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌తోనే ఆడి, 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
* 2015 & 2018: ఆర్సీబీ, కేకేఆర్ చేతిలో నాకౌట్ మ్యాచ్‌లలో రాజస్థాన్‌కు పరాజయాలు ఎదురయ్యాయి.
* 2024: గత 2024 సీజన్ ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై 4 వికెట్లతో గెలిచి క్వాలిఫైయర్-2 కి దూసుకెళ్లినప్పటికీ, అక్కడ సన్‌రైజర్స్ చేతిలోనే ఓడిపోయింది.
* ప్లేఆఫ్స్ రికార్డుని పరిశీలిస్తే.. 2013లో రాజస్థాన్ గెలవగా, 2024లో హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నేటి మ్యాచ్ ఇరు జట్లకు పాత లెక్కలని సరిచేసుకునేందుకు దక్కిన సువర్ణావకాశం.
సన్‌రైజర్స్ కి గెలుపు అవకాశాలు:
ఈ మ్యాచ్‌లో టాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఐపీఎల్ 2026 ట్రెండ్స్ ప్రకారం ముందుగా బౌలింగ్ చేసి, ఆ తర్వాత టార్గెట్‌ను ఛేజ్ చేయడం జట్లకు బాగా కలిసివస్తోంది. అందువల్ల టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవచ్చు. లీగ్ దశలో రాజస్థాన్‌పై ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్, జట్టులోని ప్లేయర్స్ భీకరమైన ఫామ్ చూస్తుంటే.. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పూర్తి ఆధిపత్యం కనిపిస్తుందని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఇరు జట్ల అంచనా:
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్. (ఇంపాక్ట్ ప్లేయర్: ప్రఫుల్ హింగే)
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), దసున్ షనక, డొనొవాన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, శుభమ్ దూబే, నాండ్రే బర్గర్, యశ్ రాజ్ పంజా, బ్రిజేష్ శర్మ. (ఇంపాక్ట్ ప్లేయర్: రవీంద్ర జడేజా లేదా రవి బిష్ణోయ్)
