RCB vs RR: ముగిసిన బెంగుళూరు పోరాటం.. సన్‌రైజర్స్‌తో తలపడనున్న రాజస్థాన్

RCB vs RR: ముగిసిన బెంగుళూరు పోరాటం.. సన్‌రైజర్స్‌తో తలపడనున్న రాజస్థాన్

సంచలన విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చిన బెంగుళూరు జట్టు పోరాటం ముగిసింది. బుధవారం(మే 22) రాజస్థాన్‌ రాయల్స్‌‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలుత బెంగుళూరు 172 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని రాయల్స్‌ బ్యాటర్లు 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో చేధించారు.

రాణించిన జైశ్వాల్

173 స్వల్ప ఛేద‌న‌లో రాజ‌స్థాన్ కు మంచి ఆరంభం లభించింది. య‌శ‌స్వి జైస్వాల్(45), టామ్ కాడ్‌మోర్ (20) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. ఈ జోడి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేస్తున్న సమయాన ఫెర్గూస‌న్.. కాడ్‌మోర్‌ను ఔట్ చేశాడు. అనంతరం జైస్వాల్- శాంసన్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. కాడ్‌మోర్ ఔటయ్యాక.. జైస్వాల్ బౌండ‌రీల‌తో విరుచుకుపడ్డాడు. అయితే, స్వల్ప వ్యవ‌ధిలో రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(45)ను గ్రీన్ ఔట్ చేయ‌గా.. కెప్టెన్ సంజూ శాంస‌న్ (17) స్టంపౌట్ అయ్యాడు.

ఆ సమయంలో రియాన్ ప‌రాగ్(36; 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‪లు) నిలకడగా ఆడాడు. ధ్రువ్ జురెల్(8), షిమ్రాన్ హెట్మెయర్(14 బంతుల్లో 26)తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయితే, రాజస్థాన్.. విజయానికి చివరి మూడు ఓవర్లలో 19 పరుగులు కావాల్సిన సమయంలో వికెట్లు కోల్పోయింది. సిరాజ్‌ వేసిన పదిహేడో ఓవర్‌ రెండో బంతికి పరాగ్ బౌల్డ్ అవ్వగా.. అదే ఓవర్ ఆఖరి బంతికి హెట్మెయర్ (26) డుప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. క్రీజులోకి వచ్సిన పావెల్(16 నాటౌట్).. ఆ మరుసటి ఓవర్‌లోనే మూడు రెండు ఫోర్లు, ఒక సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. 

భారీ స్కోర్ చేయలేకపోయిన బెంగ‌ళూరు

అంతకుముందు తాడోపేడో తేల్చుకోవాల్సిన‌ మ్యాచ్‌లో బెంగ‌ళూరు బ్యాట‌ర్లు ధాటిగా ఆడలేక‌పోయారు. రాయ‌ల్స్ బౌల‌ర్లు విజృంభించడంతో సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటిదార్‌ (34), విరాట్ కోహ్లీ (33), మహిపాల్ లామ్రోర్ (32), కామెరూన్ గ్రీన్‌ (27) పర్వాలేదనిపించారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

విజయం సాధించిన రాయల్స్.. శుక్రవారం(మే 24) క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌తో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.