ఎస్పీకి విడాకులు ఇచ్చాము

ఎస్పీకి విడాకులు ఇచ్చాము

అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతో పొత్తును ముగించుకున్నట్లు సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్, ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ అధినేత శివపాల్ సింగ్ యాదవ్ శనివారం ప్రకటించారు. తాము ఈరోజు ఎస్పీకి విడాకులు ఇచ్చామని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ తన కూటమిలోని పార్టీలకి అల్టిమేటమ్‌ జారీ చేసిన తరువాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

అంతకుముందు శివపాల్ సింగ్ యాదవ్, ఓం ప్రకాష్ రాజ్‌భర్‌లు స్వేచ్ఛగా కూటమిని వీడవచ్చని ఎస్పీ ఇరుపార్టీలకు లేఖ రాసింది. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో వీరిద్దరూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి మద్దతిచ్చారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..ముర్ముకు ఇచ్చిన విందుకు కూడా వీరిద్దరు నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో వారిపై మండిపడుతూ బహిరంగ లేఖలను ఎస్పీ విడుదల చేసింది.  "మీకు మరెక్కడైనా ఎక్కువ గౌరవం లభిస్తుందని భావిస్తే, స్వేచ్ఛగా పార్టీని విడిచిపెట్టవచ్చు’ అని ఆ లేఖల్లో పేర్కొంది. 

శివపాల్ యాదవ్ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ గుర్తుపై జస్వంత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అఖిలేష్ యాదవ్  సీఎంగా ఉన్నప్పుడు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. 2018 లో అఖిలేష్ తో విభేదించి ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారు. అటు రాజ్‌భర్ కూడా పలుమార్లు అఖిలేష్ యాదవ్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అఖిలేష్ పై రాజ్‌భర్ ఘాటు విమర్శలే గుప్పించారు. 2012లో  ములాయం సింగ్ యాదవ్ వల్లే అఖిలేష్ ముఖ్యమంత్రి అయ్యారంటూ కామెంట్స్ చేశారు.