
గండిపేట, వెలుగు : గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని రాజేంద్ర నగర్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ నుంచి మహారాష్ట్రకు సిటీ మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ వోటీ పోలీసులు బుధవారం రాజేంద్రనగర్ వద్ద వెహికల్ చెకింగ్ చేపట్టారు. ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న నలుగురు పొంతన లేని సమాధానాలు చెప్పారు.
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు కారు దిగి పారిపోయారు. వెంటనే కారులో ఉన్న మిగతా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు వెనుక భాగంలో 80 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకొని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించామని.. పరారీలో ఉన్న మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.