ఆత్మహత్యాయత్నం చేసిన రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి

ఆత్మహత్యాయత్నం చేసిన రాజీవ్‌ గాంధీ హత్య కేసు దోషి
  • వేలూరు జైలులో ఘటన
  • 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని

వేలూరు: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా తేలి వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జైలులో తోటి ఖైదీలతో గొడవ జరిగిందని, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె తరఫు లాయర్‌‌ చెప్పారు. గత కొద్ది రోజులుగా నళినీకి తోటి ఖైదీలతో గొడవ జరుగుతోందని అన్నారు. ఆత్మహత్యా యత్నం గురించి జైలు అధికారులు సమాచారం ఇచ్చారని, నళినీతో ఇంకా మాట్లాడలేదని లాయర్‌‌ అన్నారు. నళినీని వేలూరు జైలు నుంచి పుఝాల్‌ జైలుకు తరలించాలని ఆమె భర్త కోరారని, దానికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్‌ చేస్తున్నామని చెప్పారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని గత 29 ఏళ్లుగా వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె భర్త మురుగన్‌ కూడా పురుషుల జైల్లో ఉన్నారు. వాళ్లిద్దరు చాలా రోజులగా బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల తన కుమార్తె పెళ్లి కోసం ఆమె కొన్ని రోజుల పాటు పెరోల్‌పై విడుదలై, తిరిగి జైలుకు వెళ్లారు. నళిని, ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీఈ టెర్రరిస్టులతో కలిసి రాజీవ్‌ గాంధీ హత్యకు ప్లాన్‌ చేశారు. ఈ కేసులో నళిని, మురుగన్‌ సమా ఏడుగుర్ని కోర్టు దోషులుగా తేల్చింది. ఆమెకు మరణశిక్ష విధించిన కోర్టు తర్వాత దాన్ని జీవిత ఖైదుగా మార్చింది.