శ్రీలంకకు రాజీవ్​ హంతకులు

శ్రీలంకకు రాజీవ్​ హంతకులు
  •      30 ఏండ్లు జైల్లో గడిపి ఇటీవలే విడుదల
  •     స్వదేశానికి వెళ్లేందుకు అనుమతిచ్చిన న్యాయస్థానం

చెన్నై :  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన ముగ్గురు దోషులు శ్రీలంకకు బయల్దేరారు. శ్రీలంకకు చెందిన వి.మురుగన్ అలియాస్ శ్రీకరన్, ఎస్. జయకుమార్, బి.రాబర్ట్ ను సుప్రీం కోర్టు రెండేండ్ల కింద విడుదల చేయగా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల తమిళనాడులోని తిరుచిరాపల్లి క్యాంప్​లో ఉంచారు. అడ్డంకులన్నీ తొలగడంతో బుధవారం వాళ్ల సొంత దేశానికి ప్రయాణమయ్యారు. 

ఈ ముగ్గురూ కొలంబోకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉత్తర్వులు రాగానే వీళ్లంతా తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లొచ్చని తమిళనాడు సర్కారు గతంలోనే మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఈ ముగ్గురూ తమ దేశానికి రావడానికి ప్రయాణ అనుమతి పత్రాలను చెన్నైలోని శ్రీలంక హైకమిషన్ ఇదివరకే జారీ చేసింది.

 రాజీవ్ హత్య కేసులో శిక్ష పడి 30 ఏండ్లుగా జైల్లో ఖైదీలుగా ఉన్న ఏడుగురిని సుప్రీం కోర్టు 2022 నవంబర్​లో విడుదల చేసింది. ఇందులో నలుగురు  శ్రీలంకవాసులు. ఇందులో శంతన్ కొద్ది రోజుల కిందే చనిపోయారు. మనదేశానికి చెందిన మిగతా ముగ్గురు పెరారివాలన్, రవిచంద్రన్, నళిని ఇదివరకే విడుదలయ్యారు.