ఢిల్లీ సర్కారు బడి..ఇండియాలోనే నెం.1

ఢిల్లీ సర్కారు బడి..ఇండియాలోనే నెం.1

పిల్లలకు పాఠాలు చెప్పడం కాదు. ఆ పాఠాలను ఎలా ఆచరించాలో చెబుతారక్కడ. చదువుల్లో మునిగి తేలడం మాత్రమే కాదు..  పిల్లలు స్కూలు రోజుల్లోనే ఎంట్రప్రెన్యూర్స్‌‌‌‌గా, ఇన్నోవేటర్స్‌‌‌‌గా మారేందుకు దారి చూపుతారక్కడ. కొత్త కొత్త పద్ధతులతో స్టూడెంట్స్ ను తీర్చిదిద్దుతున్న ఆ స్కూలు అందుకే దేశంలోనే నెంబర్ వన్ గవర్నమెంట్ స్కూలుగా నిలిచింది. ఢిల్లీలోని ద్వారకలో ఉన్న రాజ​కీయ ప్రతిభా వికాస్ విద్యాలయ (ఆర్పీవీవీ) 2019 ఇండియా స్కూల్ ర్యాంకింగ్స్‌‌‌‌లో మొదటి స్థానం పొదింది. ‘‘చెత్తను డస్ట్ బిన్ లోనే వేయండి. పరిసరాలను శుభ్రంగా ఉంచండి” అంటూ ఇక్కడ బోర్డులు ఉండవు. అసలు డస్ట్ బిన్‌‌‌‌లే ఉండవు!

‘ఎందుకంటే.. చెత్త ఉంటేనే డస్ట్ బిన్ అవసరం ఉంటుంది. అసలు చెత్త ఏర్పడకుండా చూస్తే.. వీటి అవసరమే ఉండదు కదా! అందుకే మా స్కూలును డస్ట్ బిన్ ఫ్రీ స్కూలుగా మార్చేశాం’ అంటున్నారు ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఆర్పీ సింగ్. స్కూలును ప్రతిక్షణం పరిశుభ్రంగా ఉంచుకుంటామని, ఈ విషయంలో స్టూడెంట్స్ ను కూడా ప్రేరేపించేలా చేయడమే దీని ఉద్దేశమని ఆయన తెలిపారు. స్కూలులోని బాలికలకు రుతుస్రావానికి సంబంధించి ఇక్కటి టీచర్లు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. వాళ్లకు నాణ్యమైన శానిటరీ నాప్ కిన్స్ ఉచితంగా అందిస్తున్నారు. అంతేకాదు.. వేస్ట్ శానిటరీ నాప్ కిన్స్ ను వేసేందుకు గర్ల్స్ టాయిలెట్స్ లో ప్రత్యేకంగా బర్నింగ్ మెషిన్లు ఉంటాయి.  చదువు అంతగా అబ్బని స్టూడెంట్ల సమస్యలను తెలుసుకుని, వారిని మోటివేట్ చేసి, గాడిలో పెట్టేందుకు ఈ స్కూలులో ప్రత్యేకంగా నలుగురు టీచర్ల టీం ఉంటుంది.   పిల్లల్లో ఇన్నోవేషన్ ఐడియాలను ప్రోత్సహించి, వారిని ఎంట్రప్రెన్యూర్స్ గా మార్చేందుకు ఈ స్కూలులో ప్రత్యేక స్కీం అమలు చేస్తున్నారు. ఈ స్కీం కోసం ప్రభుత్వం ఈ సంవత్సరం రూ. 2.78 లక్షల బడ్జెట్ కేటాయించింది. పండ్ల విత్తనాలను పారేయకుండా స్కూల్‌‌‌‌లో సీడ్‌‌‌‌ కలెక్షన్‌‌‌‌ బాక్స్‌‌‌‌ను ఏర్పాటు చేశారు.

మార్కుల్లోనూ బెస్ట్

ఏటా సీబీఎస్ఈ రిజల్ట్స్ లో ప్రైవేట్ స్కూళ్లకన్నా ఆర్పీవీవీ స్టూడెంట్స్ ముందంజలో ఉంటున్నారు. స్కూల్లో మొత్తం 130 మంది స్టూడెంట్స్ ఉండగా, 78 మందికి 90 శాతంపైనే మార్కులొచ్చాయట. 12వ తరగతిలో యావరేజ్ స్కోర్ 500కు 437, టెన్త్‌‌లో యావరేజ్ స్కోరు 500కు 441 వచ్చాయని ప్రిన్సిపల్ తెలిపారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ప్రోత్సాహంతోనే తమ స్కూలును నెం.1 చేయగలిగామని ఆయన చెప్పారు.