‘రాజ్ పథ్’ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చే యోచన

‘రాజ్ పథ్’ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చే యోచన

దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా లాన్ ల పేరు మార్చాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. వీటి పేర్లను మార్చి ‘కర్తవ్య పథ్’ గా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం మార్గానికి ‘కర్తవ్య పథ్’గా పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సమాచారం.

దేశ రాజధానిలో ప్రత్యేకించి పార్లమెంటు పరిధిలో చాలా రోడ్లకు బ్రిటీషర్ల కాలం నాటి పేర్లే ఉన్నాయి. వాటన్నింటిని మార్చాలనే కృత నిశ్చయంతో మోడీ సర్కారు ఉంది. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోడీ వెల్లడించారు. ఈక్రమంలోనే ప్రధానమంత్రి నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్డు పేరును లోక్ కల్యాణ్ మార్గ్ గా ఇంతకుముందు మార్చారు.