
న్యూఢిల్లీ: సభలో ప్రతిపక్షాల చర్య ప్రమాదకరంగా ఉన్నదని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మండిపడ్డారు. వారు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా బుధవారం ప్రధాని మోదీ మాట్లాడారు. కాగా, ప్రధాని మోదీ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.
అపోజిషన్ లీడర్కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. సభలో గట్టిగా నినాదాలు చేశారు. ఆ ఆందోళనల నడుమే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించగా.. ప్రతిపక్ష సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. దీంతో మోదీ ప్రసంగాన్ని నిలిపివేశారు. దీనిపై చైర్మన్ ధన్ఖడ్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్నాయని మండిపడ్డారు.
రాజ్యాంగ విలువలు విస్మరిస్తున్నారు..
ఆరు దశాబ్దాల తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలో ఉంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రతిపక్షాలు రాజ్యాంగ విలువలను విస్మరిస్తున్నారు. వారు సభను కాదు.. మర్యాదను విడిచి వెళ్లారు. రాజ్యాంగం అనేది చేతిలో పుస్తకం కాదు. జీవితానికి మార్గదర్శకం’’ అని ధన్ఖడ్ విపక్షాలపై మండిపడ్డారు.