హైదరాబాద్, వెలుగు: దేశంలో మోదీ ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనను మెచ్చి ప్రజలు ఎన్నికల్లో పట్టం కడితే.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారంతో దాడి చేస్తున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించకుండా, విదేశాలకు వెళ్లి అక్కడ దేశంపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్లో ప్రజాస్వామ్యం లేదని, ప్రధాని మోదీపై నిందలు వేయడం ఆయనకు పరిపాటిగా మారిందని చెప్పారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నదని చెప్పారు.
పేద, మధ్యతరగతి ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా స్కీములు, విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, రైల్వేలు, భద్రత ఇలా అనేక రంగాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా నరేంద్ర మోదీ పాలన అందిస్తుంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తోందని విమర్శించారు.
హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో గ్యారంటీల పేరుతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. వంద రోజుల మోదీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. పీఎం కిసాన్ నిధి 17వ వాయిదా కింద 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్లు అకౌంట్లలో జమ చేసిందన్నారు. తెలంగాణలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ జోన్ లో కేంద్ర ప్రభుత్వం రూ.2,361 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టును రూపొందిస్తోందని తెలిపారు.