ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెన్షన్‌ వేటు.. సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణలు

ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెన్షన్‌ వేటు.. సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణలు

ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాపై సస్పెండ్ వేటు పడింది. రాజ్యసభ నుంచి ఆయన్ను సస్పెండ్‌ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని రాఘవ్ చద్దా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ ఆయన పై సస్పెన్షన్‌ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. 

రాఘవ్‌ చద్దాపై సస్పెన్షన్‌ వేటు వేయాలంటూ రాజ్యసభ పక్షనేత పీయూష్‌ గోయల్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాఘవ్ చద్దా.. నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించారని, దీనిపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఆయన్ను సస్పెండ్‌ చేయాలని కోరారు. దీనికి అధికార పక్షం సభ్యులు మద్దతు పలికారు. దీంతో ఆప్ ఎంపీని సస్పెండ్‌ చేశారు.

తమ అనుమతి లేకుండా తమను ఢిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు నలుగురు రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై చర్యలు తీసుకున్నారు. 

అంతకుముందు.. తనపై వస్తున్న ఫోర్జరీ ఆరోపణలను రాఘవ్‌ చద్దా తీవ్రంగా ఖండించారు. కమిటీలో భాగం కావాలని వారిని తాను ఆహ్వానించానని.. సంతకం ఫోర్జరీ జరగలేద కాబట్టే పార్లమెంటరీ బులెటెన్‌లో దీని గురించి ప్రస్తావించలేదని అన్నారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.