ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
బీసీ సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మికి ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించాలి
నల్గొండ, వెలుగు: బీసీ ప్రజలకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుందని బీసీ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పోటీ చేసే అందరూ బీసీ అభ్యర్థులకు పూర్తి భరోసా కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. బీసీ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి యాదవ్‌ను పరామర్శించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం రోజు తిప్పర్తికి చేరుకున్నారు. కిడ్నాప్ కు గురైన బీసీ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త యాదగిరిని పరామర్శించారు.
అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. బీసీ అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, నామినేషన్లు అడ్డుకోవడం అగ్రవర్ణాల దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణాల దురహంకారానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈ ఘటనపై ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫోన్ చేసి ఎల్లమ్మగూడెం పరిస్థితులపై వివరాలు కోరారు.
బీసీ సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మికి వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలన్నారు. కిడ్నాప్ కేసులో నిందితుడు ఊట్కూరు సందీప్ రెడ్డిని తక్షణం బైండోవర్ చేయాలన్నారు. బీసీ అభ్యర్థులకు సమస్యలు సృష్టిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డినైనా వదిలేది లేదన్నారు. మామిడి నాగలక్ష్మి కుటుంబానికి ఎన్నికల వరకు పూర్తి పోలీస్ భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర- ప్రధాన కార్యదర్శి వట్టి జానయ్య యాదవ్, జిల్లా నాయకులు విద్యావంతుల వేదిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
