పార్లమెంట్ గురించి తెలిసినవారు ఎవరూ అలా మాట్లాడరు

పార్లమెంట్ గురించి తెలిసినవారు ఎవరూ అలా మాట్లాడరు

రాజ్యాంగాన్ని, పార్లమెంట్‎ని, పార్లమెంట్ విధులను మంటగలిపే విధంగా ప్రధాని వ్యాఖ్యానించడం శోచనీయమని టీఆర్ఎస్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు.  తెలంగాణ ప్రజల్ని అవమానించేలా మోడీ మాట్లాడారని కేకే ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన అన్‎సైంటిఫిక్‎గా జరిగిందని మోడీ ఏడేళ్ల తర్వాత అంటున్నారని ఆయన అన్నారు. అసలు అన్‎సైంటిఫిక్ అంటే ఏంటో మోడీ చెప్పాలని కేకే డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‎లోని గురజాడ హాల్‎లో టీఆర్ఎస్ ఎంపీల ప్రెస్ మీట్ నిర్వహించారు.

‘పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసినవారు ఎవరూ కూడా ఇలా మాట్లాడరు. పార్లమెంట్లో జరిగే దేనినీ కోర్టు కూడా ప్రశ్నించడానికి వీలుండదు. పార్లమెంట్‎లో శాస్త్రీయం, ఆశాస్త్రీయం అంటూ ఏమీ ఉండదు. మెజారిటీ ఉందా లేదా అనేది చూసి బిల్ పాస్ చేస్తుంటారు. సభలో గలాటా జరిగితే, అప్పుడు ఏం చేయాలన్న విషయంపై కూడా రూల్ బుక్ ఉంది. తెలంగాణ బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్ధతు తెలిపింది. ఆ విషయం మరచిపోవద్దు. బిల్లు సమయంలో ఆంధ్రా ఎంపీలు నిజంగానే బాగా గొడవ చేశారు. మా మిత్రుడు లగడపాటి రాజగోపాల్, మరికొందరు గలాటా చేశారు. కానీ రూల్ బుక్ నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారు. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందిన తర్వాత ఆశాస్త్రీయం అంటే అర్థం ఏంటి? పెప్పర్ స్ప్రే చల్లడం వంటివి జరిగాయి కాబట్టే సభాపతి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే, లాబీ క్లియర్ చేసి.. ఓటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్ బుక్‎లో ఉంది. పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసయింది. నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న తీరు ఆశాస్త్రీయం. ప్రస్తావన, నోటీస్, చర్చ ఏదీ లేకుండా బుల్ డోజ్ చేస్తూ బిల్లులు పాస్ చేస్తున్నారు. పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారు. ఝార్ఖండ్ బిల్ సమయంలో కూడా కొందరు వాజపేయి మీదకి దూసుకెళ్లారు. అడ్డుకునే ప్రయత్నంలో ఆనంద్ మోహన్ అనే సభ్యుడి చేయి విరిగింది. పెప్పర్ స్ప్రే ఘటన మినహా తెలంగాణ బిల్లు ప్రక్రియ సాఫీగా జరిగింది. పార్లమెంట్ పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదు. రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయా.. లేదా.. అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటాం’ అని కేకే అన్నారు.

For More News..

పుష్కర్ ధామి ఫ్లవర్ భీ హై ఔర్ ఫైర్ భీ హై

కంపెనీల్లో కొత్త కొలువుల జోరు