రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి.. పట్టించుకోని సినీ ఇండస్ట్రీ

రాకేష్ మాస్టర్ అంత్యక్రియలు పూర్తి.. పట్టించుకోని సినీ ఇండస్ట్రీ

ఎంతో మంది డాన్స్ మాస్టర్లని తీర్చిదిద్దిన ప్రముఖ కొరియోగ్రఫర్ రాకేశ్‌ మాస్టర్‌(Rakesh Master) అంత్యక్రియలు ముగిశాయి. వందలాది మంది అభిమానులు చివరి సారిగా వీడ్కోలు పలికారు. తన చివరి కోరిక మేరకు.. హైదరాబాద్ బోరబండలోని తన మామ గారి సమాధి పక్కనే రాకేశ్‌ మాస్టర్‌ అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. కుమారుడు చైతన్య తండ్రికి అంత్యక్రియలు చేశారు. తాను చనిపోయిన తర్వాత తన అంత్యక్రియలు ఎలా జరగాలి.. ఎలా ఉండాలి అనేది ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగానే.. కుటుంబ సభ్యులు, అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

సినిమా ఇండస్ట్రీలో వెయ్యికి పైగా పాటలకు కొరియోగ్రాఫర్ గా పని చేసినా.. ఆ స్థాయిలో రాకేష్ మాస్టర్ కు సినీ ఇండస్ట్రీ గౌరవించలేకపోయింది. సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఆయనకు నివాళులు అర్పించలేదు. సంప్రదాయబద్దంగా కూడా ఎవరూ హాజరుకాకపోవటం అనేది చర్చనీయాంశం అయ్యింది. కేవలం యూట్యూబ్ ఛానెల్స్ వారు.. ఇతర కొంత మంది చిన్న చిన్న డాన్సర్లు మాత్రమే ఆయనకు నివాళులర్పించారు. 

సినీ ఇండస్ట్రీ అస్సలు పట్టించుకోకపోవటంపైనా చర్చ జరుగుతుంది. బతికి ఉన్నప్పుడు ఎన్నెన్నో అనుకుంటాం.. అంటుంటారు.. చనిపోయిన తర్వాత అయినా సినీ ఇండస్ట్రీ సరైన రీతిలో ఆయనకు నివాళులు అర్పించి ఉంటే బాగుండేదని అంటున్నారు సినీ అభిమానులు. ఉన్నది ఉన్నట్లు.. కుండబద్దలు కొట్టి మాట్లాడటం అనేదే ఆయన చేసిన పాపమా అంటున్నారు సినీ అభిమానులు.