సిద్ధూ.. రాజకీయాల్లో రాఖీ సావంత్‌

సిద్ధూ.. రాజకీయాల్లో రాఖీ సావంత్‌

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్‌ నవజోత్‌ సింగ్ సిద్ధూపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పంజాబ్ పాలిటిక్స్‌లో ఆయన నటి రాఖీ సావంత్ అంటూ పోల్చారు ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్ధా. ‘‘పంజాబ్ పాలిటిక్స్‌లో రాఖీ సావంత్ లాంటి వాడైన నవజోత్ సింగ్ సిద్దూపై కాంగ్రెస్ హైకమాండ్ కొన్నాళ్ల పాటు నాన్‌ స్టాప్‌గా తిట్ల దండకం అందుకుంది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా పని చేసినందకు ఆయనకు అక్షింతలు పడ్డాయి. దీంతో ఇప్పుడు ఆయన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంట పడ్డారు. రేపటి వరకు ఆగితే మళ్లీ కెప్టెన్‌పై సిద్ధూ నోరేసుకుని పడిపోతారు” అని రాఘవ్‌ ట్వీట్ చేశారు.  ఢిల్లీ సీఎం, ఆప్‌ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రైతులను మోసం చేస్తున్నారంటూ నవజోత్ సింగ్ సిద్ధూ ఓ వీడియోను ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేయడంతో రాఘవ్‌ చద్ధా ఈ విధంగా స్పందించారు.

 

ఆమ్‌ ఆద్మీ పార్టీ రైతు పక్షపాతినని చెప్పుకుంటూ ఓ వైపు కేంద్రం తెచ్చి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ మరోవైపు ఆ చట్టాల్లోని విషయాలను అమలు చేస్తోందని సిద్ధూ ఆరోపించారు. ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ల స్థానంలో ప్రైవేట్‌ మండీలను తీసుకొస్తూ అరవింద్ కేజ్రీవాల్ సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. పేరుకు ఎంఎస్పీ (కనీస మద్దతు ధర) ప్రకటించినా ధరలు తగ్గించేసి రైతులను దోపిడీ చేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు సిద్ధూ. అయితే ప్రైవేట్ మండీలను నోటిఫై చేసిన విషయం వాస్తవమేనని, అయితే ప్రభుత్వ మార్కెట్లు మూసేయలేదని, రైతులకు నచ్చిన చోట అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు.